బోటు ప్రమాదం : రాజమండ్రిలో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ రాజమండ్రికి చేరుకున్నారు. బోటు ప్రమాద ఘటన అనంతరం జరుగుతున్న సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు ఆయన వచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం ప్రభుత్వాసుపత్రికి వచ్చి..తెలంగాణ వాసులను ఆయన పరామర్శించారు. బోటు ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో 10tv మాట్లాడింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదన్నారు.
రాత్రి 1గంటకు ఇక్కడకు తమ బృందంతో వచ్చి..పరామర్శించినట్లు వెల్లడించారు. బోటులో తెలంగాణ వాసులు ఎంతమంది ప్రయాణించారో తెలియడం లేదన్నారు. వారికి సంబంధించిన బంధుమిత్రులు వస్తున్నారని, వీరి నుంచి వివరాలు మధ్యాహ్నం వరకు తెలిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మృతి చెందిన కుటంబానికి సీఎం కేసీఆర్..రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు గుర్తు చేశారు.
సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం పోశమ్మ గండి నుంచి 71 మందితో రాయల్ వశిష్ట బోటు పాపికొండలకు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలు వెలికి తీశారు. 27 మంది సురక్షితంగా ఉన్నారు. కచ్చులూరు వద్ద గాలింపులు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీంలు గాలింపులు చేపడుతున్నాయి.