విద్యార్ధులు తొందరపడ్డారు: స్టూడెంట్స్ ఆత్మహత్యలపై మోహన్ బాబు

  • Published By: vamsi ,Published On : April 26, 2019 / 10:08 AM IST
విద్యార్ధులు తొందరపడ్డారు: స్టూడెంట్స్ ఆత్మహత్యలపై మోహన్ బాబు

Updated On : April 26, 2019 / 10:08 AM IST

తెలంగాణలో విద్యార్ధుల ఆత్మహత్యల అంశంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సినీ నటుడు మోహన్ బాబు తొలిసారి స్పందించారు. ఇంటర్ ఫలితాల్లో మార్కులు తారుమారై మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులది తొందరపాటు నిర్ణయం అని మోహన్ బాబు అంటున్నారు. తెలంగాణలో విద్యార్ధుల ఆత్మహత్యలు కలచివేసొందంటూ, ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని విద్యార్ధులు తల్లిదండ్రులను శిక్షించవద్దని తెలుపుతూ ఒక లేఖను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు మోహన్ బాబు.

‘‘భగవంతుడు జన్మనిచ్చింది ఆఖరి శ్వాస వరకూ జీవించడానికి, ఆ జీవితాన్ని మార్కులు రాలేదనో, పరీక్షలో తప్పామనో ముగించుకుంటే తల్లిదండ్రులు, స్నేహితులు,  సన్నిహితులు, బంధువులు తల్లడిల్లిపోతారు. ఇది పిల్లలు అర్థం చేసుకోవాలి. ఒక విద్యాసంస్థ అధినేతగా వేల మంది విద్యార్ధినీ, విద్యార్ధులను అనుక్షణం నీడలా అనుసరిస్తూ, వాళ్లకు మనోనిబ్బరాన్ని కలిగిస్తున్న నాకు తెలంగాణ రాష్ట్రంలో కొందరు విద్యార్ధినీ, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలచివేసింది. ప్రభుత్వం స్పందించింది. తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది. ఈలోపు దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, మీరే సర్వస్వంగా జీవిస్తున్న తల్లిదండ్రుల హృదయాలను శక్షించకండి. వారు కోరుకునేది మీ ఉన్నతిని. వారి కోసం, వారి సంతోషం కోసం కళకళలాడుతూ వారి కళ్ళముందు ఎదిగి చూపిస్తామని నిర్ణయం తీసుకోండి.” అంటూ ప్రకటనను విడుదల చేశారు.

తెలంగాణలో ఇంటర్ పరీక్షల విషయంలో ఏర్పడిన గందరగోళం నేపధ్యంలో సోషల్ మీడియాలో మోహన్ బాబు ఎందుకు స్పందించడం లేదంటూ తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఎన్నికలకు ముందు ఏపీలో విద్యార్థులను తీసుకుని రోడ్డెక్కిన మోహన్ బాబు.. తెలంగాణలో ఉంటూ ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎందుకు ఏమీ మాట్లాడట్లేదని నెటసిజన్లు విమర్శించారు. ఈ క్రమంలో మోహన్ బాబు లేఖను విడుదల చేశారు. అయితే మోహన్ బాబు తన లేఖలో  ఇంటర్ బోర్డు తీరుపై కానీ, ప్రభుత్వం స్పందనపై కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.