ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు మాత్రమే మంగళగిరి గుడిలో ఇలా చేస్తారు

గుంటూరు జిల్లా మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారు ఝూమున నాలుగు గంటలనుంచే భక్తులకు స్వామి వారి ఉత్తర దర్శనాన్ని కల్పించారు. స్వామిని దర్శించుకోటానికి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సోమవారం ఒక్క రోజే సుమారు లక్ష మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
మంగళగిరి ఆలయంలో ముక్కోటి ఏకాదశిరోజు ప్రత్యేకంగా…. దక్షిణావృత బంగారు శంఖం ద్వారా ఇచ్చే తీర్ధం కోసం కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనం కోసం క్యూలైన్లో వేచి వున్నారు. భక్తుల రధ్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణా వృత శంఖు తీర్ధం రెండు రోజుల పాటు అంటే ఏకాదశి,ద్వాదశి రెండు రోజులపాటు ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
విశాఖ శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మనందేంద్ర సరస్వతి వారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఆలయ మర్యాదల ప్రకరణం స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఏకాదశి సందర్భంగా ఆలయంలో భక్తులకు భగవంతుని అనుసంధానం చేసే విధంగాఏర్పట్లు ఉన్నాయని స్వాత్మానందేంద్ర సరస్వతి గారు అన్నారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్ధానికి ఎమ్మెల్యే ఆర్కే (ఆళ్ళ రామకృష్ణారెడ్డి) లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం సాధారణ భక్తులవలె ఉచిత దర్శనం క్యూలైన్లో వచ్చి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
వైష్ణవ క్షేత్రాలలో అత్యంత వేడుకగా నిర్వహించే పండగల్లో అతిముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి. ఏకాదశి తిథి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రంమైనది. వైకుంఠ నగరానికి స్వస్వరూపంతో వెళ్లడం ఎవరికీ సాధ్యపడదు. స్వామివారు దుష్ట సంహారానికి వెళ్లేటప్పుడు, దుష్ట సంహారం అనంతరం మళ్లీ వైకుంఠ నగరానికి విచ్చేయునప్పడు… దేవతలు స్వామి వారి దర్శనార్థం వైకుంఠ ద్వారం వద్ద నిరీక్షిస్తారు. ఆ వైకుంఠ ద్వారానికి ప్రతీకగా ఆలయ ఉత్తర ద్వార దర్శనం విరాజిల్లుతోంది. మార్గశిర, పుష్యమాసాల్లో ధనుర్మాస వ్రతం నిర్వహిస్తారు. స్వామి వారికి ధనుర్మాసం ప్రతీపాత్రమైనది. ఈ మాసంలోనే వైకుంఠ ఏకాదశి నిర్వహిస్తారు.
మంగళాద్రి దర్శనం సర్వపాపహరణం
ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైన మంగళాద్రి క్షేత్రం సాక్షాత్తు వైకుంఠ నగర శోభను సంతరించుకుంటుంది. యుగయుగాల దేవుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్ల దైవసన్నిధి ఉత్తర గాలిగోపురంలో శ్రీ నరసింహస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా బంగారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించేందుకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కనుక… ఆ రోజున ఉత్తర ద్వారం వద్ద స్వామివారిని దర్శించిన ముక్కోటి దేవత సహితంగా స్వామివారిని దర్శించిన ఫలం కలుగుతుంది.
ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామి వారు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించుకున్నవారికి మోక్షప్రాప్తి కలుగుతుందని పలు పురాణాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తిరుమల, భద్రాద్రి పుణ్య క్షేత్రాల తర్వాత మంగళాద్రి క్షేత్రంలో జరిగే ముక్కోటి ఉత్సవాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించి, ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించి తరిస్తారు.
దక్షిణావృత శంఖం
మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉన్న విశిష్ట సంపదలో దక్షిణావృతశంఖం ఒకటి. దీనిని తంజావూరు మహారాజు 1820లో దేవాలయానికి కానుకగా సమర్పించినట్లు చెబుతారు. బంగారు తొడుగుతో ఉన్న ఈ శంఖం నుంచి సర్వదా, సర్వవేళలా ప్రణవనాదం (ఓంకారం) వినిపిస్తుండడం విశేషం. ముక్కోటి ఏకాదశినాడు మాత్రమే ఈ మహత్తర దక్షిణావృతశంఖంతో భక్తులకు తీర్థమందిస్తారు.
మంగళాద్రి క్షేత్రంలో ముక్కోటి ఉత్సవాలు
జనవరి, 5, 6 తేదీలలో అత్యంత వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానంలో ఏర్పాట్లు చేశారు. 5వ తేదీ జాగరణ సందర్భంగా భజనలు, అన్నమయ్య సంకీర్తనలు ఇంకా పలు సాంస్క్రతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముక్కోటి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐదో తేదీ రాత్రి స్వామివారిని జగన్మోహిని రూపంలో అలంకరించి పుష్పక విమానంపై ఊరేగిస్తారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తిరుమంజనోత్సవం నిర్వహిస్తారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆరో తేదీ వేకువజామున నాలుగు గంటల నుంచి స్వామివారు ఉభయదేవేరులతో కలిసి బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించిన భక్తులకు బంగారు దక్షిణావృతశంఖుతో తీర్థం అందజేస్తారు. మధ్యాహ్నం స్వామి వారి గ్రామోత్సవం నిర్వహిస్తారు. విశేషంగా తరలివచ్చే భక్తల రద్దీని పురస్కరించుకుని దక్షిణావృతశంఖు తీర్థాన్ని ఏకాదశి, మరుసటి రోజు ద్వాదశి (2020 జనవరి 6, 7 తేదీలు)న కూడా ఇవ్వనున్నారు.