డిసెంబర్ 26న హైదరాబాద్‌కు రాష్ట్రపతి

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శీతాకాలపు విడిదిలో భాగంగా 2019, డిసెంబర్ 26న హైదరాబాద్‌కు రాబోతున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు విచ్చేయనున్నారు. రాష్ట్రపతి విడిదికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు. రాష్ట్రపతి రాకపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మల్కాజిగిరి ఆర్డీవో మధుసూదన్‌ను నోడల్ అధికారిగా నియమించారు. రాష్ట్రపతి 26వ తేదీన హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు వస్తారని, ఆయన ప్రయాణించనున్న ప్రాంతాలను అందంగా తీర్చిదిద్ది, విద్యుత్ సమస్యలను తక్షణం పరిష్కరించాలని సూచించారు. రోడ్డు కు ఇరువైపులా మొక్కలను అందంగా అలంకరించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
వైద్య శిబిరంతోపాటు 108 వాహనాన్ని అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని, భోజన వసతి ఏర్పాటు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. పాసుల కోసం అధికారులు ఎంప్లాయ్ ఐడీ, ఆధార్ కార్డు, ఫొటోలను నార్త్ జోన్ డీసీపీ, బేగంపేట ఏసీపీకి అందచేయాలన్నారు.