పోరుకు సిధ్ధం : రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు

హైదరాబాద్: రెవెన్యూశాఖను సమూల ప్రక్షాళన చేస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ సర్కార్‌కు, ఆ శాఖ ఉద్యోగులకు మధ్య వివాదం ముదురుతోంది. రెవెన్యూశాఖలో పనిచేస్తోన్న వివిధ విభాగాల ఉద్యోగులు హైదరాబాద్‌లో మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈసమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు, ప్రభుత్వ తీరుపై ప్రధానంగా చర్చించారు. రెవెన్యూశాఖ రక్షణ, ఉద్యోగుల పరిరక్షణ కోసం జేఏసీని ఏర్పాటు చేశారు. రెవెన్యూశాఖలో సంస్కరణలను స్వాగతించాలని, అదే సమయంలో రెవెన్యూశాఖ ఉనికిని దెబ్బతీసే నిర్ణయాలను ప్రతిఘటించాలని జేఏసీ నిర్ణయించింది. రెండుమూడు రోజుల్లో కేటీఆర్‌ను కలవాలని సైతం నిర్ణయించారు. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు రెవెన్యూ శాఖ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను కేటీఆర్‌కు నివేదించనున్నారు. అంతేకాదు త్వరలోనే జేఏసీ తొలి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నారు.
సమావేశానంతరం మాట్లాడిన ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూ పరిపాలనను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ విధానం ఇతర రాష్ట్రాల్లో ఫెయిలైందని, ఫెయిలైన విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలనుకోవడం సహేతుకం కాదన్నారు. టాస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ట్రెసా స్పష్టం చేసింది. తెలంగాణను అవినీతి రహితంగా మార్చాలనుకుంటే ఒక్క రెవెన్యూశాఖను ప్రక్షాళన చేస్తే సరిపోతుందా ? ఒక్క రెవెన్యూశాఖలోనే లంచగొండి ఉద్యోగులు ఉన్నారా? అవినీతిరహితం చేయాలనుకుంటే అన్ని శాఖల్లో అవినీతిని సంస్కరించాలని రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
భూమి ఉన్నంత వరకు వివాదాలు ఉంటాయని, భూ వివాదాలను పరిష్కరించాలనుకుంటే రైతు ఆధీనంలో ప్రతి గుంటభూమిని లెక్కించి, సర్వేరాళ్లు పాతించాలని సూచించారు. నిజంగా ప్రజలకు మేలు చేసే చట్టం తేవాలనుకుంటే స్వాగతిస్తామని ప్రకటించారు. రెవెన్యూ ఉద్యోగులు లంచగొండులు, అవినీతిపరులంటూ బద్నామ్ చేసి ఇప్పుడు ఇతర శాఖలకు బదిలీ చేస్తే తాము ఎలా పనిచేయాలని ప్రశ్నించారు. అందుకే రెవెన్యూ ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ పథకం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 58 ఏళ్లకు పదవీ విరమణ చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఏయే బెనిఫిట్లు అందిస్తారో వాటన్నింటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లోపభూయిష్టమైన ధరణి వెబ్‌సై్‌ను రెవెన్యూశాఖపై రుద్ది, దానిలోని లోపాలకు ఉద్యోగులను బాధ్యులను చేస్తే ఎలా అని రవీందర్‌రెడ్డి ప్రశ్నించారు. యూజర్ ఫ్రెండ్లీ ధరణి వెబ్‌సైట్‌ను మార్చాలని ఎన్నో విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని ఆక్షేపించారు. మొత్తానికి కేసీఆర్ వ్యాఖ్యలపై రెవెన్యూ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. రెవెన్యూశాఖను ప్రక్షాళన చేస్తే ఇతర శాఖలను కూడా ప్రక్షాళన చేస్తారా అన్న చర్చ నడుస్తోంది.