ఆర్టీసీ సమ్మెపై విచారణ వాయిదా

  • Published By: veegamteam ,Published On : November 1, 2019 / 12:10 PM IST
ఆర్టీసీ సమ్మెపై విచారణ వాయిదా

Updated On : November 1, 2019 / 12:10 PM IST

ఆర్టీసీ సమ్మె పిటిషన్‌ వచ్చే గురువారం (నవంబర్ 7, 2019) వాయిదా పడింది. సంస్థ ఇంచార్జ్‌ ఎండీ ఇచ్చిన నివేదికపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. తప్పుడు లెక్కలు సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది. బస్సుల కొనుగోలుకు ఇచ్చిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లింపుగా ఎలా పేర్కొంటారని యాజమాన్యాన్ని కోర్టు ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ ఆర్టీసీకి డబ్బులు చెల్లించాలా లేదా అనేది తేల్చాలని సూచించింది. కోర్టులకు సరైన వివరాలు ఇవ్వాలని చురకలు అంటించింది. ఇద్దరు ఐఏఎస్ అధికారులు కోర్టులో ఉండి కూడా వాస్తవాలు చెప్పడం లేదని అసహనం వ్యక్తం చేసింది.

బస్సుల మైలేజీ, ఆక్యుపెన్సీ తిరిగే దూరం బట్టి లాభ నష్టాలు లెక్కిస్తామని ఆర్టీసీ ఇంచార్జ్‌ ఎండీ అన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని మరో మారు కోర్టుకు తెలిపారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు మైలేజీ, ఆక్యుపెన్సీ ఆధారంగా అవార్డులు కూడా ఇచ్చారని కార్మిక సంఘాల తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. రూ.2 వేల 277 కోట్లు ఇప్పటి వరకు ఆర్టీసీకి ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని కార్మిక సంఘాలు వెల్లడించాయి.

ఆర్టీసీ సమ్మెపై శుక్రవారం (నవంబర్ 1, 2019) హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వంతోపాటు జీహెచ్‌ఎంసీ చెల్లించిన నిధులపై ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ అందచేసిన నివేదికపై హైకోర్ట్‌ అంసతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ చెల్లించాల్సిన నిధులను ఆపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణను నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు ఆ రోజు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌శర్మను ఆదేశించింది.