చర్చలు విఫలం : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తప్పదా

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తప్పదా? పండుగ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడాల్సిందేనా? తాజా పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలోని సోమేష్‌కుమార్ కమిటీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో అక్టోబర్ 05 నుంచి సమ్మె ఉంటుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదని తెలిపాయి. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా వెనక్కి తగ్గేది లేదని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు.
అక్టోబర్ 02వ తేదీ బుధవారం తెలంగాణ ఆర్టీసీ యూనియన్ నేతలతో సీనియర్ ఐఏఎస్‌ల కమిటీ సమావేశమైంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారన్న సోమేష్‌కుమార్… వీలైనంత త్వరగా ఆర్టీసీ నేతల డిమాండ్లపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. సమ్మె విషయంలో జేఏసీ నేతలు కొద్దిరోజులు ఓపిక పట్టాలని సూచించారు. ఆర్టీసీ సమ్మెపై ప్లాన్-ఎ, ప్లాన్-బి రెడీగా ఉన్నాయని స్పష్టం చేశారు.
మరోవైపు ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మనసులో ఏముందన్న ఆసక్తి నెలకొంది. ఆర్టీసీ యూనియన్ల జేఏసీతో జరిగిన సమావేశంలో ప్లాన్-ఏ, ప్లాన్-బి గురించి ప్రస్తావించడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు మాట వినికపోతే తమ దగ్గర ప్లాన్-బి ఉందని చెప్పడంతో… అసలు ఈ విషయంలో ప్రభుత్వం ఏ రకమైన ఆలోచనతో ఉందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈసారి కచ్చితంగా తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో ప్రభుత్వం ఈ విషయంలో వేరే ప్రతిపాదనలు పెట్టినా… కార్మికులు అంగీకరించే ప్రస్తావన ఉండకపోవచ్చని తెలుస్తోంది.
Read More : అక్టోబర్ 5 నుంచి సమ్మెకు వెళ్తాం : అశ్వత్థామరెడ్డి