కేకే మధ్యవర్తిత్వం : పరిష్కారం దిశగా ఆర్టీసీ స్ట్రైక్!

సమ్మె విరమణకు ప్రభుత్వం, ఆర్టీసీ మధ్య మళ్లీ చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు చర్చలకు సిద్ధపడాలంటూ ఎంపీ కేకే లేఖ రాశారు. ఆ లేఖపై ఆర్టీసీ కార్మిక సంఘాలు సానుకూలంగా స్పందించాయి. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమేనని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీని ప్రభుత్వం మళ్లీ చర్చలకు పిలుస్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి కేకేను టీఆర్ఎస్ అధిష్టానమే రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 14వ తేదీ సోమవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన..హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఇక్కడకు వచ్చిన అనంతరం కార్మిక సంఘాల నేతలు, వామపక్ష పార్టీ నేతలతో సమావేశం జరుపుతారని తెలుస్తోంది.
ఆర్టీసీ సమ్మెపై ఎంపీ కేశవరావు రాసిన లేఖపై జేఏసీ నేతలు స్పందించారు. కేశవరావు అంటే తమకు గౌరవం ఉందన్నారు. ఆయన ఎక్కడికి పిలిచినా చర్చకు వస్తామని ప్రకటించారు. టీఎన్జీఓ నాయకులతో తాము సమ్మెకు వెళ్లేముందు ఫోన్లో మాట్లాడామని, కానీ ఇప్పుడు మాట్లాడలేదంటూ టీఎన్జీవో నేతలు మాట మార్చడం బాధాకరమని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పారు.
మరోవైపు ఆర్టీసీ సమ్మె 10వ రోజుకు చేరుకుంది. వీరు చేపడుతున్న సమ్మెకు రోజురోజుకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. దశలవారీగా ఉద్యమానికి పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీకి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థలు… మద్దతు, సంఘీభావం తెలుపుతున్నాయి. ఉద్యోగ వర్గాల్లో ఒకటి, రెండు సంఘాలు మినహా పలు సంఘాలు మద్దతు తెలిపాయి. ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలిచాయి. ఇక సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన కొన్ని సంఘాలు సమ్మెకు మద్దతుపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మెకు రెవెన్యూ సంఘాలు, గెజిటెడ్ అధికారుల సంఘం, ఈబీసీ సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించింది.
Read More : గమనిక : 3 రోజులూ నీటి సరఫరాకు అంతరాయం..ఏరియాలు ఇవే