హ్యాండ్సప్ : ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్‌కాట్ చేసిన కాంగ్రెస్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం(మార్చి 12) జరిగే ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నామంటూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. టీఆర్‌ఎస్ తీరుకు నిరసనగానే ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నామని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రెండోసారి కేసీఆర్ సీఎం అయ్యాక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఐదుగురిని పోటీకి దింపిందని అన్నారు. ఎమ్మెల్సీ స్థానాలున్న ఐదింటిలో టీఆర్ఎస్ 4, ఎంఐఎం నుంచి ఒక అభ్యర్థి బరిలో ఉన్నారని వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన లెక్కల ప్రకారం చూస్తే.. కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఓ సీటైనా గెలవాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 88 మంది.. కాంగ్రెస్ నుంచి 19 మంది.. ఇద్దరు టీడీపీ నుంచి గెలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే ఒక్కొక్కరికి 21 మంది ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన కాంగ్రెస్‌కు టీడీపీ ఇద్దరు సభ్యులు సపోర్ట్ చేస్తే.. ఒక ఎమ్మెల్సీ సులువుగానే గెల్చుకునేది.
అనూహ్యంగా టీడీపీ నుంచి సండ్రవెంకట వీరయ్య, కాంగ్రెస్ నుంచి ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్‌లు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ బలం 19 నుంచి 15కు పడిపోయింది. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశాలు లేకపోలేదు. టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ప్రలోభ పెడుతుందంటూ ఆరోపించిన టి కాంగ్ నేతలు పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహించడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా టీఆర్ఎస్‌లో చేరారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీలు మాత్రమే మిగిలారు. వారిద్దరి పదవీకాలం ముగిసింది. దీంతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. తమకున్న సంఖ్యా బలంతో ఒక్క సీటైనా గెలవాలని కలలుగన్న కాంగ్రెస్‌కు… టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నిరాశపరిచింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేది లేదంటూ టీ పీసీసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో నలుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు, ఎంఐఎం అభ్యర్థి ఎన్నిక లాంఛనం కానుంది.