సెలవులు లేవు : వారం రోజులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

నాలుగు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ మళ్లీ సమావేశమవుతోంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వరుస సెలవులు రావడంతో వాయిదా పడిన సభ...

  • Published By: veegamteam ,Published On : September 14, 2019 / 03:53 AM IST
సెలవులు లేవు : వారం రోజులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Updated On : September 14, 2019 / 3:53 AM IST

నాలుగు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ మళ్లీ సమావేశమవుతోంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వరుస సెలవులు రావడంతో వాయిదా పడిన సభ…

నాలుగు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ మళ్లీ సమావేశమవుతోంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వరుస సెలవులు రావడంతో వాయిదా పడిన సభ… శనివారం(సెప్టెంబర్ 14,2019) నుంచి మళ్లీ సమావేశం కానుంది. వారంపాటు సాగనున్న ఈ సమావేశాల్లో… ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు, దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం రెడీ అయ్యాయి.

బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు సెలవులు లేకుండా కొనసాగనున్నాయి. ఇవాళ, రేపు బడ్జెట్‌పై సభలో చర్చ జరగనుండగా.. సోమవారం సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. వారం రోజులు జరిగే ఈ సమావేశాల్లో విపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసింది. సభలో విపక్షాల పాత్ర నామమాత్రమే అయినా దీటుగా స్పందించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ దగ్గర ఉన్న శాఖలకు సంబంధించి సభలో సమాధానాలు ఇచ్చేందుకు ఇప్పటికే నలుగురు మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయా శాఖలకు సంబంధించిన ప్రశ్నలపై ఆ మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.

మరోవైపు.. పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించిన సీఎం… తమ శాఖలకు సంబంధించిన అంశాలపై సమగ్ర సమాచారంతో రావాలని… ప్రతిపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని మంత్రులకు సూచించారు. ఇక.. విస్తరణలో మంత్రి పదవులు చేపట్టిన కేటీఆర్, హరీష్ రావులు అసెంబ్లీలో అధికార పార్టీకి అదనపు బలం కానున్నారు. విపక్ష నేతలకు కౌంటర్లు ఇచ్చేందుకు వీరు ఇప్పటికే సిద్ధమయ్యారు. దీంతో కేసీఆర్ సభలో లేకపోయినా అధికార పార్టీ నేతలకు కొత్త అస్త్రాలు అందుబాటులోకి వచ్చినట్లుయింది. ఇక ఇవాళ్టి ప్రశ్నోత్తరాలలో మంత్రి కేటీఆర్‌కు సంబంధించిన శాఖలపైనే ఎక్కువ ప్రశ్నలు ఉండబోతున్నాయి.  అధికార పార్టీ అస్త్రశస్త్రాలతో సిద్ధమవగా… అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ప్రశ్నలు సంధించేందుకు ప్రిపేరయ్యాయి. మరి.. విపక్షాల ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.