తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం!

స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డిని నియమించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Published By: veegamteam ,Published On : January 9, 2019 / 03:56 AM IST
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం!

Updated On : January 9, 2019 / 3:56 AM IST

స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డిని నియమించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. ఈ పదవికి పోటీ కూడా లేదు. సీనియర్స్ చాలా మంది విముఖత కూడా చూపిస్తున్నారు. ఈ సమయంలోనే సీఎం.. కొందరు నేతలతో చర్చించారు. వారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వైపు మొగ్గుచూపిస్తున్నారు. ఆయనతో మాట్లాడి ఒప్పించినట్లు కూడా తెలుస్తోంది. పోచారంకి స్పీకర్ పదవి ఖాయం అని పార్టీ నేతలు అంటున్నారు. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈలోపు ఎంపిక పూర్తి చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. 

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కీలక శాఖలకు ఆయన మంత్రిగా పని చేశారు. సీనియర్ శాసనసభ్యుడిగా పోచారంకు అనుభవం ఉంది. అసెంబ్లీలో సుదీర్ఘకాలం ఉన్న నేతగా కూడా గుర్తింపు పొందారు. ఇదే అసెంబ్లీ నిర్వహణకు ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అలాగే ఇంగ్లీష్ పై పోచారంకి మంచి పట్టు ఉండటంతో సభ నిర్వహణలో ఇబ్బందులు ఉండవనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు. గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను సమర్ధవంతంగా నిర్వహించారు. 

స్పీకర్ పదవి కోసం పోచారంతోపాటు మరో నలుగురు సీనియర్ ఎమ్మెల్యేల పేర్లను పరిశీలించారు. మహిళలకు ఈ పదవిని ఇవ్వాలని భావిస్తే మెదక్ ఎమ్మెల్యే  పద్మా దేవేందర్ రెడ్డి, బీసీ వర్గాలకు అయితే ఈటల రాజేందర్, ఎస్సీ వర్గానికి ఇవ్వాల్సివస్తే కొప్పుల ఈశ్వర్, ఎస్టీ వర్గం నుంచి డిఎస్. రెడ్యానాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం పోచారం వైపే మొగ్గు చూపుతున్నారు. 

ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్  అహ్మద్ ఖాన్ ను ప్రొటెం స్పీకర్ గా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయి స్పీకర్ ఎన్నిక జరిగే వరకు ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఈ బాధ్యతలు నిర్వహిస్తారని, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మంగళవారం  ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.