ఉనికి పాట్లు : స్పీడ్ పెంచుతున్న కమలదళం

  • Published By: chvmurthy ,Published On : March 4, 2019 / 03:42 PM IST
ఉనికి పాట్లు : స్పీడ్ పెంచుతున్న కమలదళం

Updated On : March 4, 2019 / 3:42 PM IST

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… తెలంగాణ లో బీజేపీ స్పీడ్ పెంచింది. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. పేదల సంక్షేమానికి కేంద్రం ఏం చేసిందో వివరిస్తూనే.. ఓటు బ్యాంకు ఎలా పెంచుకోవాలా అని వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలోని 17 స్థానాలకుగాను మెజారిటీ నియోజకవర్గాలు దక్కించుకోవాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనైనా గెలిచి తన సత్తా చాటి పరువు నిలుపుకోవాలని ఉబలాట పడుతోంది. త్వరలోనే నోటిఫికేషన్ రానుండటంతో ఎన్నికల కసరత్తు మొదలుపెట్టింది. ఈసారి 17 స్థానాల్లో పోటీ చేయాలని మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. తద్వారా  ఉనికి చాటుకోవడమే కాకుండా  బీజేపీ కేంద్రంలో సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. మోడీ పాలనపై అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని బీజేపీ నేతలంటున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మరోసారి మోడీనీ అధికార పీఠంపై కూర్చోబెడుతుందని కమలనాథులు ధీమాగా ఉన్నారు.

నమో 2019 పేరుతో ఎన్నికలకు వెళ్తున్న బీజేపీ మేనిఫెస్టోతో పాటు ప్రతీ కార్యక్రమంలో  ప్రజలను భాగస్వామ్యం చేసేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతీ మండల, గ్రామ స్థాయిలో సూచనలు స్వీకరించే బాక్స్ ఉంచింది. ప్రజల అభిప్రాయాలు, సూచనలను మోడీ దృష్టికి తీసుకెళ్తామని నాయకులు చెబుతున్నారు. బైక్ ర్యాలీలు, క్లస్టర్ సమావేశాలు, బూత్ స్థాయి సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థులతో ముఖాముఖి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో చర్చాగోష్టి.. అసంఘటిత కార్మికులను కలవడం, ప్రతి మండలంలో ప్రచార రథాలను తిప్పడం లాంటి కార్యక్రమాలను కూడా బీజేపీ చేపట్టనుంది. 

మోడీ సర్కార్‌పై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడమే కాకుండా  కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకతను పోగెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమలనాథులు దృష్టిపెడుతున్నారు. 17 స్థానాల్లో బలమైన నాయకులు బరిలో నిలిచి మెజారిటీ స్థానాలను గెలుపొందేలాగా వ్యూహాలు రచిస్తున్నారు. రాఫెల్, జీఎస్టీ, నోట్ల రద్దుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా పుల్వామా దాడి తర్వాతి పరిణామాలు ఈ ఎన్నికల్లో తప్పకుండా మైలేజీ సాధించిపెడతాయని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.