అన్నదాత పద్దు : తెలంగాణ బడ్జెట్ 1, 82, 017 కోట్లు

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రతిపాదనల మొత్తం లక్షా 82 వేల 17 కోట్లు రూపాయలుగా ఉన్నాయి. దీనిలో రెవెన్యూ వ్యయం లక్షా 31 వేల 629 కోట్ల రూపాయలు. రెవెన్యూ మిగులు 6 వేల 564 కోట్ల రూపాయలు. అటు ఆర్థిక లోటును 27 వేల 749 కోట్లుగా అంచనా వేశారు. తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 20 వేల 107 కోట్ల రూపాయలు కేటాయించారు. అటు పంట కాలనీలు, ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిచ్చారు. నీటిపారుదల, వ్యవసాయ రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అన్ని రకాల ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మొత్తం లక్షా 82 వేల 17 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించారు. రెవెన్యూ వ్యయం లక్షా 31 వేల 629 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం 32 వేల 815 కోట్ల రూపాయలు. రెవెన్యూ మిగులును 6 వేల 564 కోట్ల రూపాయలుగా చూపించారు. కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో రాష్ట్రం కూడా అదే బాటలో పయనించాల్సి వచ్చిందని బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ చెప్పారు.
రాష్ట్ర బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి పెద్దపీట వేశారు. వచ్చే ఐదేళ్లలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లను పూర్తిచేసి కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నీటి పారుదల రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రంగానికి 22 వేల 500 కోట్ల రూపాయలు కేటాయించారు. మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులను నింపుతామని కేసీఆర్ చెప్పారు.
నీటిపారుదల తర్వాత వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. పంట కాలనీలు, రైతుల భాగస్వామ్యంతో ఆహార శుద్ధి పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 20 వేల 107 కోట్ల రూపాయలు కేటాయించారు. రైతు రుణమాఫీ పథకానికి 6 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది డిసెంబర్ నాటికి లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీ వర్తింప చేస్తారు.
రైతుబంధు పథకానికి కూడా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని 10 వేల రూపాయలకు పెంచారు. దీంతో ఈ పథకానికి బడ్జెట్‌లో 12 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. వచ్చే ఖరీఫ్ నుంచి పెంచిన పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు. అటు రైతు బీమా పథకానికి 650 కోట్ల రూపాయలు కేటాయించారు.
తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా చేపట్టిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఈ ఏడాది కరెంట్ ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావించారు.