ఎవరికి ఛాన్స్ : హరీష్..కేటీఆర్‌లకు మంత్రి పదవి డౌటే !

  • Published By: madhu ,Published On : February 16, 2019 / 01:38 AM IST
ఎవరికి ఛాన్స్ : హరీష్..కేటీఆర్‌లకు మంత్రి పదవి డౌటే !

Updated On : February 16, 2019 / 1:38 AM IST

ఈనెల 19న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాజ్‌భవన్‌ వేదికగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌కు అందజేశారు. అయితే.. మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఈసారైనా పూర్తిస్థాయి విస్తరణ ఉంటుందా.. లేక కేవలం 10 మందికే పరిమితం చేస్తారా అనే సందేహం గులాబీశ్రేణుల్లో మొదలైంది. మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కాకుండా మరో 17 మందికి ఛాన్స్‌ ఉంటుంది. అయితే ఇప్పటికే హోంమంత్రిగా మహమూద్‌ అలీని నియమించారు. దీంతో మరో 16 మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉది. అయితే.. 19న జరిగే మంత్రివర్గ విస్తరణలో ఎంతమందికి ఛాన్స్‌ దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. 
ఉమ్మడి జిల్లాల ప్రాదిపదికగానే మంత్రి పదవుల పంపకాలు జరగనున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగానే బెర్త్‌లు ఖరారు కానున్నాయి. ఈ విడతలో బలహీన వర్గాలకు చెందిన నేతలకు ప్రాధాన్యతనిచ్చే అవకాశం కనిపిస్తుండగా.. అందులో కొత్తవారికే అధిక ప్రాధాన్యం ఉండే అవకాశం ఉండడంతో పాతవారికి ఈసారి బెర్త్‌ దక్కే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గతంలో మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డికి మరోసారి ఆ ఛాన్స్ దక్కడం లేదని తెలుస్తోంది. జోగు రామన్నకు మాత్రం మరోసారి ఆ అవకాశం దక్కనుండగా… రేఖానాయక్ కు మాత్రం కేబినెట్‌ పదవిపై డౌట్ కొనసాగుతోంది.  అలాగే ఉమ్మడి క‌రీంన‌గ‌ర్‌ ఉమ్మడి జిల్లా నుంచి ఈటెల రాజేందర్‌ను మరోసారి మంత్రిపదవి వరిస్తుండగా.. ఎప్పటినుంచో మంత్రి పదవికోసం ఎదురుచూస్తున్న కొప్పుల ఈశ్వర్‌ కోరిక కూడా ఎట్టకేలకు నెరవేరబోతోంది. మరోవైపు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టిన కేటీఆర్‌కు మాత్రం ఈ దఫా మంత్రిపదవి దక్కడం డౌట్‌గానే కనిపిస్తోంది. ఇక ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా విషయానికి వస్తే… ఈ జిల్లా నుంచి గతంలో మంత్రిగా పనిచేసిన  పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డిని స్పీకర్‌గా ఎన్నుకోవడంతో ఆయన స్థానంలో వేముల ప్రశాంత్‌రెడ్డి కేబినెట్‌లో తీసుకోబోతున్నారు. 

ఉమ్మడి వ‌రంగ‌ల్‌ జిల్లా నుంచి గత కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహించిన క‌డియం శ్రీ‌హ‌రితోపాటు మంత్రిగా పనిచేసిన చందూలాల్‌కు ఈసారి ఆ ఛాన్స్‌ దక్కేటట్లు లేదు. ఈ జిల్లానుంచి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు మంత్రివర్గంలో చోటు దక్కించుకోబోతుండగా…రెడ్యానాయక్‌ కేబినెట్ బెర్త్ డౌట్ లో పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా పనిచేయగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో ఈ జిల్లా నుంచి  పువ్వాడ అజ‌య్‌కి కేబినెట్ బెర్త్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం కొత్తవారికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజా మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డికి మరోసారి మంత్రిపదవి దక్కడం లేదని తెలుస్తుండగా… ఎంపీగా ఉన్న గుత్తాసుఖేందర్ రెడ్డికి మాత్రం మంత్రివర్గంలో చేరబోతున్నారు. మరోవైపు పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి కేబినెట్ బెర్త్‌ డౌట్ గా ఉంది.
ఇక ఉమ్మడి మెదక్ జిల్లా పరిస్థితి చూస్తే… గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డిని ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ జిల్లా నుంచి గతంలో మంత్రిగా పనిచేసిన హ‌రీష్‌రావుకు మాత్రం ఈసారి మంత్రి పదవి డౌట్‌గానే కనిపిస్తోంది.

అలాగే ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లాలో గతంలో మంత్రులుగా లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావులు పనిచేయగా..ఎన్నికల్లో జూపల్లి ఓటమి చెందారు. ఇక లక్ష్మారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. కొత్తగా నిరంజన్‌రెడ్డికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక  హైద‌రాబాద్ జిల్లా విషయానికి వస్తే… నాయిని న‌ర్సింహారెడ్డి, ప‌ద్మారావు మంత్రి పదవులకు దూరంగానే  ఉండబోతున్నారు. త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌ మాత్రం కేసీఆర్ కేబినెట్‌లో రెండోసారి అవకాశం దక్కించుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లానుంచి గత కేబినెట్‌లో మంత్రి పదవి నిర్వహించిన మ‌హేంద‌ర్‌రెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా గెలవకపోవడంతో ఆ ఛాన్స్ కోల్పోయారు. అయితే.. ఆయన సోదరుడు పట్నం  న‌రేంద‌ర్‌రెడ్డికి, అలాగే శేరిలింగంపల్లి నుంచి గెలిచిన అరిక‌పూడి గాంధీకి కూడా మంత్రిపదవి దక్కడం డౌట్‌గానే కనిపిస్తోంది. మొత్తానికి ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ తేదీ ఖరారు కావడంతో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మరి ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో చూడాలి.