పెరగనున్న ఎండలు

హైదరాబాద్: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడి పోతున్నారు. తెలంగాణాని ఆనుకుని ఉన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావం వలన సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మంగళవారంనుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కోన్నారు. ఆదివారం అత్యధికంగా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకమండలం ఏడూళ్ళబయ్యారం, నిర్మల్ జిల్లాపెంబిలలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, నిర్మల్ జిల్లా భైంసా, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు పెరిగాయి.
ఆదివారం హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఊదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు జల్లులు కురిశాయి. సోమవారం కూడా తెలంగాణ లో అక్కడక్కడా ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోత, వేడితో సతమతమవుతున్న నగర వాసులకు ఆదివారం రాత్రి కురిసిన వాన కాస్త ఊరటనిచ్చింది.
మరోవైపు కోస్తాంధ్రలో నేడు సాధారణంకన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండ్రోజుల్లో ఒకట్రెండుచోట్ల వర్షాలు కూడా కురవ వచ్చని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లోనూ సోమవారం సాధారణంకన్నా అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. ఆదివారం అనంతపురంలో 42.6, కర్నూలులో 42.2, కడపలో 42, తిరుపతిలో 42, నెల్లూరులో 41, జంగమహేశ్వరపురంలో 40.6, నందిగామలో 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.