దుండిగల్ ఘటన : దొంగల కోసం పోలీసుల వేట

దోపిడీ దొంగలు బరి తెగించారు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. హైదరాబాద్ శివారులోని దుండిగల్ లో పోలీసులపై దోపిడి దొంగలు దాడికి యత్నించారు. మాపైనే దాడికి చేసేందుకు యత్నిస్తారా? మీ పని పడతాం అంటున్నారు పోలీసులు. దీంట్లో భాగంగా దొంగల కోసం గాలింపుని ముమ్మరం చేశారు. దీనికోసం మూడు బృందాలుగా వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. సీపీఎస్, ఎస్ వోటీ పోలీసులతో పాటు మరో టీమ్ ను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు.
అది నగర శివారు ప్రాంతం దుండిగల్. నగల షాపును దోచుకునేందుకు దొంగలు కాపు కాశారు. ఆ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు వారిని గుర్తించారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా..ఎస్సైపై కారు ఎక్కించి చంపేందుకు యత్నించి సాధ్యం కాకపోవటంతో కారు అక్కడ వదిలేసి పరారయ్యారు. కారును పరిశీలించిన పోలీసులకు కార్లలో దోపికి వచ్చిన దొంగల కార్ల నిండా..కట్టర్లు, బండరాళ్లు కనిపించాయి. నగల షాపుల దోపిడీ కోసం వీటిని ముందస్తుగానే తెచ్చుకున్నారని పోలీసులు నిర్థారణకు వచ్చారు.
పరారైన దొంగలను పట్టుకునేందుకు దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ ఏరియాలో ఉన్న సీసీ టీవీ కెమెరాల పుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కరడు కట్టిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో నగరంలో సంచరిస్తున్న ఇటువంటి ముఠాల పని పట్టేందుకు గాలింపుని ముమ్మరం చేశారు. ముఠానాయకుడిని గుర్తించే పనిలో పడ్డారు.
నగరంలో దోపిడీ దొంగల అరాచకాలు పెరిగిపోతున్నాయి. అడ్డుకున్న వారి ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటంలేదు. దొంగల ఆట కట్టించేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు గస్తీని పటిష్టం చేసి..కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో దొంగల్ని పట్టుకునేందుకు యత్నించిన ఎస్సైపై కారు పోనిచ్చి దాడికి యత్నించిన ఘటన నగరంలో మరోసారి కలకలం రేపింది. పోలీసులు కూడా అంతే స్థాయిలో దొంగల వేటలో పడ్డారు.