ఇంకెన్ని రోజులు : ఆర్టీసీ సమ్మె 31 రోజులు

ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లారు. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారానికి 31 రోజులకు చేరుకుంది. నవంబర్ 05వ తేదీల్లోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం లెటెస్ట్‌గా డెడ్ లైన్ విధించింది. దీంతో కొంతమంది విధుల్లో చేరుతున్నారు. చాలా మంది ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా సమ్మె కొనసాగిస్తున్నారు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో మొత్తం 19 వేల 950 మంది వరకు..ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులున్నారు. ఉప్పల్ డిపోలో అసిస్టెంట్ మేనేజర్, బండ్లగూడ డిపోలో మహిళా కండక్టర్ విదుల్లో చేరారు.
ఇదిలా ఉంటే..ఉదయం ..రాత్రి వేళల్లో బస్సులు లేకపోవడంతో నగర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. బస్సులు లేకపోవడంతో భారీ సంఖ్యలో ప్రైవేటు వాహనాలు రోడ్డెక్కతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. వారంతాలో ఈ సమస్య అధికంగా ఉంది. సమ్మెతో ప్రజలు వ్యక్తిగత వాహనాలు వినియోగిస్తుండడంతో రోడ్డులు రద్దీగా మారుతున్నాయి. కొండాపూర్ నుంచి లక్డీకపూల్ రావడానికి గంటా 45 నిమిషాల సమయం పడుతోందని వాహనదారులు వాపోతున్నారు. నవంబర్ 03వ తేదీ ఆదివారం కావడంతో అరకొరగా బస్సులు తిరిగాయి.
దీంతో ప్రజలు గమ్యస్థానాలు చేరుకోవడానికి నానా తంటాలు పడ్డారు. నగర శివారు కాలనీల్లో ప్రజల సమస్య చెప్పనవసరం లేదు. ప్రధాన రహదారికి చేరుకోవడానికి ఆటోలు, క్యాబ్స్‌పై ఆధార పడుతున్నారు. నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉండడంతో అధికంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రధాన రహదారులు మినహా..కాలనీలకు బస్సులు నడవడం లేదని..ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తోందని ప్రయాణీకులు వెల్లడిస్తున్నారు.
మరోవైపు..ఉద్యోగంలో తిరిగి చేరాలని అనుకొనే ఆర్టీసీ కార్మికులను ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా అడ్డగించినా, ఘెరావ్ చేసినా..బెదిరింపులకు దిగినా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్, మహేష్ భగవత్‌లు హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిర్భయంగా విధుల్లో చేరొచ్చని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా అడ్డుకొంటే..సంబంధిత పోలీస్ స్టేషన్‌లో లేదా డయల్ 100 ద్వారా కంప్లయింట్ చేయాలని సూచించారు.
Read More : బిగ్ బాస్ 3 విజేత : బార్బర్ షాప్ పెడుతా – రాహుల్