నేడే ఆఖరి రోజు: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అల్టిమేటం

  • Published By: vamsi ,Published On : November 5, 2019 / 01:31 AM IST
నేడే ఆఖరి రోజు: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అల్టిమేటం

Updated On : November 5, 2019 / 1:31 AM IST

తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతుందా? బేష‌ర‌తుగా విధుల్లో చేరాలంటూ.. అందుకు ఒక డెడ్‌లైన్ కూడా విధించిన ప్రభుత్వం నవంబర్ 5వ తేదీ లోపు అంటే ఇవాళ అర్ధరాత్రి 12గంటల లోపు కార్మికులు విధుల్లో చేరాలంటూ అల్టిమేటం జారీ చేసింది. సమస్యలేమైనా ఉంటే తర్వాత పరిష్కారాలు చూద్దాం.. ముందు ఉద్యోగాల్లో చేరండి అంటున్నారు. గడువు పూర్తయ్యే లోగా విధుల్లో చేరకుంటే ఆర్టీసీ కార్మికులు ఇక ఇంటికే పరిమితం అవుతారు అంటూ తేల్చి చెప్పేసింది. ఆ తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యోగాల్లో చేర్చుకోకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్ర‌తిప‌క్షాలు, యూనియ‌న్ల మాయ‌లో ప‌డి కార్మికులు అన‌వ‌స‌రంగా న‌ష్ట‌పోతున్నార‌ని అభిప్రాయపడ్డ కేసిఆర్.. బస్సులను ప్రైవేటు పరం కూడా చేస్తానని అంటున్నారు. కార్మికులు గడువు(ఇవాళ అర్ధరాత్రి)లోగా విధుల్లో చేరకపోతే ఇప్పటికే 5వేల ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇచ్చిన ప్రభుత్వం.. మిగిలిన 5వేల బస్సులకు కూడా ప్రైవేటు పర్మిట్లు ఇస్తామని తద్వారా మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం.

ఇచ్చిన గడువులోగా కేసీఆర్ ఇచ్చిన అవకాశం వినియోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా? వినియోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాలను ఇబ్బందులపాలు చేయడమా? అనేది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం చెబుతుంది. అయితే కార్మికులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది వాళ్ల ఆలోచనా వైఖరి ఏంటి అనేది సాయంత్రం లోగా తేలనుంది.

మరోవైపు న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె విషయంలో ప్రభుత్వానికి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదు. సుప్రీం కోర్టుకు వెళ్లినా కూడా ఏళ్లకు తరబడి కేసుల విచారణ నడుస్తాయి. దాని వల్ల కార్మికులు నష్టపోయే అభిప్రాయం కూడా కొందరు కార్మికుల్లో ఉంది. ఈ క్రమంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు కార్మికులు అనేది తెలియవలసి ఉంది.