43వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది ఆర్టీసీ జేఏసీ.

  • Published By: veegamteam ,Published On : November 16, 2019 / 01:56 AM IST
43వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

Updated On : November 16, 2019 / 1:56 AM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది ఆర్టీసీ జేఏసీ.

ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరుకుంది. ఐతే.. రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో.. తమ ప్రధానమైన ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది ఆర్టీసీ జేఏసీ. మిగిలిన 25 డిమాండ్లపై ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానించాలని కార్మిక సంఘాలు కోరినా.. ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు.

ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలకు మధ్య చర్చలకు గుదిబండగా మారిన విలీనం డిమాండ్‌ను ఆర్టీసీ జేఏసీ వదులుకుంది. దీంతోనైనా తమను చర్చలకు పిలువాలని ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ సమ్మె 43వ రోజుకు చేరుకున్నప్పటికీ కార్మికులతో చర్చలకు మాత్రం ప్రభుత్వం ససేమిరా అంటోంది. చివరకు హైకోర్టు కూడా చర్చలు జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన మెట్టుదిగలేదు. 

ఇదిలా ఉంటే.. ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అర్థంకాక మల్లగుల్లాలు పడుతోంది ఆర్టీసీ జేఏసీ. 48 వేల మంది కార్మికులు సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఆర్టీసీ కార్మికులు మొదటి నుంచి కూడా విలీనం విషయంలో పట్టుదలతో ఉన్నారు. ప్రభుత్వం కచ్చితంగా విలీనం విషయంపై చర్చ జరపాలని, మిగిలిన డిమాండ్ల పై కూడా చర్చలకు ఆహ్వానించాలని కోరుతూ వస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి సమ్మె చేసినా… ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఉద్యమం చేసినా.. సీఎం కేసీఆర్‌ మాత్రం రూట్ల ప్రయివేటీకరణపైనే ప్రతిరోజూ రవాణా శాఖ, ఆర్టీసీ ముఖ్య అధికారులతో సమీక్ష చేస్తున్నారు కానీ.. కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు సీఎం సుముఖంగా లేనట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. 

సమ్మె ప్రారంభించడానికి ముందే విలీనం డిమాండ్ కాకుండా మిగతా డిమాండ్లపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అప్పుడు ఆర్టీసీ జేఏసీ విలీనం డిమాండ్ లేకుండా చర్చలకు ససేమిరా అనడంతో ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అప్పట్నుంచి సీఎం కేసీఆర్ కార్మిక సంఘాలతో ఇక చర్చలు ఉండవని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు కూడా తేల్చి చెప్పారు.

ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ నిర్ణయంపై కార్మికవర్గాల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంతో శత్రుత్వం మంచిది కాదని.. సామరస్యంగా డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని చెబుతుంటే… మరోవర్గం మాత్రం ఇంతదాకా వచ్చాక ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాల్సిందే అనే అభిప్రాయాన్ని జేఏసీ నేతలకు తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కకుపెట్టినట్లు సమాచారం.