సీపీ సజ్జనార్ ఎవరు.. గతంలో ఏం చేశారు?

సీపీ సజ్జనార్ ఎవరు.. గతంలో ఏం చేశారు?

Updated On : December 6, 2019 / 10:48 AM IST

దేశమంతా వినిపిస్తున్న పేరు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. శుక్రవారం జరిగిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ వెనుక ఉన్న కీలక వ్యక్తి ఈయనే. 27ఏళ్ల పశువుల డాక్టర్‌ను అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనలో విచారణ జరుపుతుండగా నిందితులపై ఎన్ కౌంటర్ జరిగిందని ఆయనే వెల్లడించారు. అసలు సజ్జనార్ ఎవరు.. ఈయన కెరీర్లో ఇలాంటి నిర్ణయాలు ఇంతకుముందు తీసుకున్నారా.. అని తెలుసుకోవాలంటే..

కర్ణాటక నుంచి 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆఫీసర్. 2008వరంగల్‌లో సూపరిండెంట్‌ ఆఫ్ పోలీస్ గా వ్యవహరించారు. ఇద్దరు బాలికలపై యాసిడ్ దాడికి పాల్పడిన ముగ్గురిని ఎన్‌కౌంటర్ చేసిన సమయంలో ఆ ప్రాంతానికి ఎస్పీగానే ఉన్నారు.ఆ తర్వాత యాంటీ నక్సలైట్ యూనిట్‌కు స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ ఐజీగా నియమితులైయ్యారు సజ్జనార్.

చాలా మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్, మావోయిస్టుల లొంగుబాటులో ఈయన పాత్ర చాలా ఉంది. ఆగష్టు 2016లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ యూనిట్‌కు హెడ్‌గా నియమించారు. గ్యాంగ్‌స్టర్ నయూముద్దీన్ పారిపోయే ప్రయత్నం చేయబోతుండగా ఎన్‌కౌంటర్ జరిగింది.

మరోసారి పశువుల డాక్టర్ పై జరిగిన ఘటనను సజ్జనార్ సీరియస్ గా తీసుకున్నారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాల కోసం రీ కన్ స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులను ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు షూట్ చేసినట్లు సజ్జనార్ తెలిపారు.హైదరాబాద్ లో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సీపీ సజ్జనార్ స్పందించారు.

కేస్ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నిందితులు ఫోన్‌తో పాటు మరికొన్ని కీలక ఆధారాలు ఉన్నాయని చెప్పడంతో షాద్‌నగర్‌కు తీసుకొచ్చాం. ఆధారాలు సేకరించే పనిలో ఉండగా నిందితులు రాళ్లు రువ్వుతూ.. పోలీసు రివాల్వర్ లాక్కొని దాడి చేయాలనుకున్నారు. ఎదురెదురు కాల్పులు జరగడంతో నలుగురు నిందితులు మరణించారు. ఈ ఘటన ఉదయం 5గంటల 15నిమిషాల నుంచి 6గంటల మధ్యలో జరిగింది.