వెదర్ అప్ డేట్ : తెలంగాణాలో 48 గంటల్లో వర్షాలు

లక్షద్వీప్ ప్రాంతం నుంచి కర్ణాటక, రాయలసీమ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనంగా మారింది. దీంతో ఆగ్నేయ, దక్షిణ దిశ నుంచే గాలులు వీస్తున్నాయి. రాగల 48 గంటల్లో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం అక్టోబర్ చివరి వరకు ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమనం మొదలైందని.. తెలంగాణలో మాత్రం ఇది ఈనెలాఖరు తర్వాతే మొదలవుతుందని వెల్లడించింది. అప్పటివరకు తరుచూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాష్ట్రంలో పలుచోట్ల చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన పట్టణాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల రహదారులు తెగిపోయాయి.
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మొక్కజొన్న, పత్తి, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఉపరితల ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లో అక్టోబర్ 13వ తేదీ ఆదివారం, అక్టోబర్ 14వ తేదీ సోమవారం పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో రాగల 48 గంటల్లో భాగ్యనగరంలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం .. మరికొన్ని ప్రాంతాల్లో భారీగా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.
Read More : ఖమ్మంలో టెన్షన్ : సొమ్మసిల్లిన మహిళా కండక్టర్