ఆ ఆరు స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందా?

తిరుగు లేని బ‌లంతో దూసుకుపోతున్న టిఆర్ఎస్ ఇప్పటి వ‌ర‌కు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బోణీ కొట్ట లేదు.

  • Published By: veegamteam ,Published On : March 21, 2019 / 01:54 AM IST
ఆ ఆరు స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందా?

Updated On : March 21, 2019 / 1:54 AM IST

తిరుగు లేని బ‌లంతో దూసుకుపోతున్న టిఆర్ఎస్ ఇప్పటి వ‌ర‌కు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బోణీ కొట్ట లేదు.

హైదరాబాద్ : ఎన్నిక‌ల్లో జ‌రిగే చిత్రవిచిత్రాలు అన్నీఇన్నీ కావు. రాజ‌కీయ పార్టీలు అప్రతిహ‌త విజ‌యాలు సాధించినా కొన్ని స్థానాలు వారి ఖాతాలో ప‌డ‌వు. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ది అదే పరిస్థితి. తిరుగు లేని బ‌లంతో దూసుకుపోతున్న టిఆర్ఎస్ ఇప్పటి వ‌ర‌కు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బోణీ కొట్ట లేదు. మరి ఈ సారి ఎన్నిక‌ల్లోనైనా ఆ ఆరు స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందా? ఇంతకీ ఏంటా ఆరు స్థానాలు? ఈ సారి అక్కడ పరిస్థితి ఎలా ఉంది?

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత.. ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్.. అజేయ శ‌క్తిగా మారింది. ప్రతిప‌క్ష పార్టీల‌కు అంద‌నంత స్పీడ్‌లో గులాబీ కారు దూసుకుపోతోంది. గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, మ‌ల్కాజ్ గిరి ఎంపీలు టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో.. ఎంపీల సంఖ్య 14కు చేరింది. కొంత కాలం క్రితం చేవెళ్ల టిఆర్ఎస్ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేర‌డంతో ఆ సంఖ్య ప‌ద‌మూడుకు ప‌డిపోయింది. అయితే రాష్ట్రంలోని ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఇప్పటి వరకు టీఆర్ఎస్‌కు అందని ద్రాక్షగా నిలిచాయి. ప్రస్తుతం ఎన్నిక ఏదైనా గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న గులాబీ పార్టీ ఆ ఆరు నియోజకవర్గాల్లో గుబాళిస్తుందా లేదా అన్నదే అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న.

ఖ‌మ్మం, న‌ల్లగొండ‌, నాగ‌ర్ క‌ర్నూల్, సికింద్రాబాద్, మ‌ల్కాజ్ గిరి, హైద‌రాబాద్ స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ ఇప్పటి వ‌ర‌కు బోణీ కొట్టలేదు. గులాబీ బాస్ మిష‌న్ 16 నినాదంతో పార్టీ శ్రేణులను ఉత్తేజ‌ప‌రుస్తున్నారు. ఒక్క హైద‌రాబాద్ మిన‌హా అన్నీ స్థానాల్లోనూ టిఆర్ఎస్  జెండా ఎగ‌ర‌డం ఖాయమ‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఢంకా బజాయించి ప్రచారం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటడంతో.. పార్లమెంట్  ఎన్నికలపై గులాబీ బాస్ ధీమాగా కనిపిస్తున్నారు. ప‌ద‌హారు ఎంపిలు గెలిస్తే కేంద్రాన్ని  శాసించ‌వ‌చ్చ‌ని ప్రజ‌ల‌కు పిలుపునిస్తున్నారాయ‌న‌. 

పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో పొలిటిక‌ల్ వార్ వ‌న్ సైడే అన్నట్టుగా త‌యారైంది. ఖ‌మ్మం మిన‌హా అన్ని పార్లమెంటు స్థానాల ప‌రిధిలో మెజారిటీ ఎంఎల్ఏల‌ను టిఆర్ఎస్ గెలుచుకుంది. ఖమ్మంలో ఇండిపెండెంట్ స‌హా ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు కారెక్కేందుకు రెడీ అయ్యారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎప్పుడూ గట్టిపోటీ ఇవ్వని టీఆర్ఎస్ ఈ సారి.. మిత్రపక్షమైన ఎంఐఎంతో కలిసి శాసనసభ స్థానాలను క్లీన్‌స్వీప్ చేసింది. నాగ‌ర్ క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఒక్క కొల్లాపూర్ మిన‌హా అన్ని స్థానాలు కారు ఖాతాలోకే వెళ్లాయి. ఇక దేశంలోనే అతిపెద్ద పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గమైన మ‌ల్కాజ్ గిరి లోక్ స‌భ స్థానంలో గులాబీ జెండాను రెపరెపలాడించాలని ప‌ట్టుద‌ల‌తో ఉంది నాయ‌క‌త్వం. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్బీన‌గ‌ర్ సీటు త‌ప్ప అన్ని స్థానాల్లోనూ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేల‌ను గెలుచుకుంది టిఆర్ఎస్.

ఇప్పుడు ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే కూడా కారెక్కుతుండ‌టంతో ప్ర‌తిప‌క్షాల‌కు క‌ష్ట‌కాల‌ం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. న‌ల్గొండ స్థానంలో టిఆర్ఎస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఖాతా తెర‌వ‌లేదు. పార్టీ ఆవిర్బావం త‌ర్వాత జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లో పొత్తుల్లో భాగంగా సీటును వ‌దులుకున్న టిఆర్ఎస్ 2014లో రెండ‌వ స్థానంలో నిలిచింది. ఈ సారి ఒక్క హుజూర్ న‌గ‌ర్ సీటు త‌ప్ప అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తొలిసారి న‌ల్ల‌గొండ కోట‌లో కారు షికారు చేసే అవ‌కాశాలున్నాయంటున్నారు ఆపార్టీ నేత‌లు. 

హైద‌రాబాద్ లో ఎంఐఎం అధినేత అస‌ద్‌ను మిత్రుడిగా టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆ స్థానం మిన‌హా అన్ని చోట్ల గెలుపే లక్ష్యంగా స్కెచ్ వేశారు. మరోవైపు శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో చ‌తికిల బ‌డ్డ కాంగ్రెస్ కు ఎంఎల్ఎలు, నేత‌ల వ‌ల‌స‌లు త‌ల‌నొప్పిగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఆ పార్టీకి నామమాత్రంగా మారింది. ఆ ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేసీఆర్ సిక్స్ కొట్టి.. మిషన్ 16ను రీచ్‌ అవుతారో లేదో చూడాలి మరి.