హ్యాట్సాఫ్ తల్లీ : కాళ్లు లేని చిన్నారి ‘క్యాట్ వాక్’ 

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 03:50 AM IST
హ్యాట్సాఫ్ తల్లీ :  కాళ్లు లేని చిన్నారి ‘క్యాట్ వాక్’ 

Updated On : October 4, 2019 / 3:50 AM IST

అందాల పోటీలంటే అందగత్తె అనిపించుకోవటం కాదు. మనస్సు..ఆలోచనలు…అన్నీ అందంగా ఉండాలి. అందం అంటే శరీర కొలతలు కాదు. అందమంటే ఆత్మవిశ్వాసంతో విజయాలు అందుకోవటం. మనలో ఉన్న శారీరక..మానసిక లోపాలను అధిగమించి విజయకేతనం ఎగువేయటం అని నిరూపించింది కాళ్లులేని ఓ బాలిక. ఆ చిన్నారి పేరు డైసీ మే. 

పసిచాయలు కూడా వీడని ఈ చిన్నారి ప్రపంచం అంతా తనవైపు చూసేలా చేసుకుంది. తొమ్మిది సంవత్సరాల డైసీ మోడల్ గా తనకంటూ ఓ ప్రత్యేక ఏర్పరచుకుంది. మోడల్ అంటే ర్యాంప్ పై కాళ్లతో ‘క్యాట్ వాక్’ చేయటమేకాదు..కాళ్లు లేకపోయినా ‘క్యాట్ వాక్’ చేయవచ్చని నిరూపించింది. ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ప్యారిస్ లో ఫ్యాషన్ షోలో మెరిసింది.కాళ్లు లేకుంటేనేం నాలో ఏం తక్కువ అంటూ సత్తాను చాటింది. ‘ప్యారిస్ ఫ్యాషన్ వీక్ -2019లో పాల్గొన్న డైసీని ఫ్యాషన్ ప్రియులు అంతా కళ్లార్పకుండా చూశారు. ఏంజెల్ లా కనువిందు చేసింది. ఐఫిల్ టవర్ లో జరిగిన ‘లులూ ఎట్ జీజీ’ సంస్థ నిర్వహించిన చైల్డ్స్ కాస్ట్యూమ్ ఫ్యాషన్ షోలో పాల్గొంది. 

డైసీది బ్రిటన్ లోని బర్మింగ్ హామ్. 18నెలల వయస్సులోనే మోకాళ్ల కింది భాగంలో వచ్చిన లోపాలతో కాళ్లు కోల్పోయింది. ఆడుతు పాడుతు గెంతులేస్తు..పెరగాల్సిన డైసీ వీల్ చైర్ కే పరిమితం అయిపోయింది. అయినా ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. కాళ్లు లేకపోయినా ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసంతోనే పెరిగింది. పిల్లలు చేసే ఫ్యాషన్ షోలో ఎంట్రీ ఇచ్చింది. ఫ్యాషన్ షోలో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఆర్టిఫిషియల్ కాళ్లతోనే ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసింది. ఈ ప్రతిభకు..ఆత్మస్థైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పలు బ్రిటన్ సంస్థల కాస్ట్యూమ్స్ కు మోడల్ గా పనిచేస్తోంది డైసీ.

లండన్ లో 2019 ఫిబ్రవరిలో జరిగిన వీక్ లోనే కాక..న్యాయార్క్ ఫ్యాషన్ వీక్ లో కూడా ప్రముఖ ఫ్యాషన్ ప్రియులను..విశ్లేషకులను సైతం డైసీ ఆకట్టుకుంది. ప్రశంసలు పొందింది. 

తన చిన్నారి ఆత్మవిశ్వాసానికి తండ్రి మురిసిపోతుంటారు. కాళ్లు లేకుండా తన బిడ్డ ఎలా బతుకుతుందోనని ఆందోళన పడ్డాననీ..దాంతో మద్యానికి బానిసగా మారిపోయాననీ..బిడ్డను ఆ స్థితిలో చూసి తట్టుకోలేక చనిపోవాలని కూడా అనుకున్నానని కానీ డైసీని భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నానని కన్నీళ్లతో చెబుతున్నాడు ఆ తండ్రి. డైసీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. 

అన్నట్లు జిమ్ లో డైసీ చేసే వర్క్ అవుట్లు చూస్తే ఆశ్చర్యపోతాం. అంతేకాదు డైసీ చేసే ఫీట్లు చూస్తే నిజంగా ఆచిన్నారికి కాళ్లు లేకపోవటం నిజం కాదేమో అనిపిస్తుంది. మరి మీరు కూడా చూడండీ ఈ చిచ్చరపిడుగు చేసే ఫీట్లు.