Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ నినాదం.. భార‌త్‌కు ఇబ్బందులు తప్పవా?

అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాబోయే కాలంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు భారత్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ నినాదం.. భార‌త్‌కు ఇబ్బందులు తప్పవా?

US president Donald Trump

Updated On : January 21, 2025 / 11:51 AM IST

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తన మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ట్రంప్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదాన్ని బలంగా వినిపించారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెతానని ప్రతినబూనారు.

 

ప్రమాణ స్వీకారం అనంతరం పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల పై ట్రంప్ సంతకాలు చేశారు. తొలిరోజే ట్రంప్ దూకుడుతో భారత్ పై ట్రంప్ 2.0 ప్రభావం ఎలాంటి ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. భారతదేశంతో సహా ప్రపంచ దేశాలపై ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ నినాదం బలంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాలో అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాక.. ఇప్పటి వరకు అమెరికాకు అక్రమంగా వెళ్లిన వారిపైనా కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. ట్రంప్ అనూహ్యమైన, ఎవరూ అంచనావేయలేని నిర్ణయాలు తీసుకుంటుంటాడు. గతంలో ట్రంప్ పరిపాలన సమయంలో పలు దేశాలపై అనూహ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడుకూడా ట్రంప్ పాలన అదేవిధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 

అమెరికాకు ఆయా దేశాల నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు పెంచుతానని ట్రంప్ ప్రకటించారు. భారతదేశంపైనా ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అమెరికాకు స్టీల్, అల్యూమినియం, జనరిక్ మెడిసెన్స్, వజ్రాలు భారత్ కు ఎగుమతి అవుతున్నాయి. గతంలో భారత స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ సుంకాలు విధించారు. ఈసారి మరింతగా సుంకాల భారం పెరిగే అవకాశం ఉందన్న వాదన ఉంది.

 

ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత జన్మత: పౌరసత్వం రద్దుపై సంతకం చేశారు. అమెరికాకు వలస వెళ్లిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగానే అమెరికా పౌరసత్వం వస్తుంది. అయితే, ప్రస్తుతం ఆ చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. ‘‘అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మత: పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే.. తల్లిదండ్రుల్లో ఒకరికైనా యూఎస్ సిటిజన్ షిప్, శాశ్వత నివాసి, యూఎస్ మిలిటరీ సభ్యత్వం ఇలా ఏదోక గుర్తింపు ఉండాలని ట్రంప్ నిబంధన విధించారు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం అమెరికాలోని భారతీయులకు ఇబ్బందికర విషయమనే చెప్పొచ్చు. 2024 గణాంకాల ప్రకారం అమెరికాలో 54లక్షల మంది భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. యూఎస్ జనాభాలో 1.47శాతం మంది వారే ఉండటం గమనార్హం.

 

అమెరికాలో విద్య, వైద్యం, ఐటీ రంగాల్లో రాణిస్తున్న భారతీయులు ఉన్నారు. ఉద్యోగాలు, విద్యావకాశాలు, వ్యాపారాలకోసం వెళ్లినవారు ఉన్నారు. ప్రస్తుతం ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అదిరోహించడంతో హెచ్1బీ, ఎఫ్1 వీసాలు, గ్రీన్ కార్డులపై భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీతో డొనాల్డ్ ట్రంప్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఈసారి భారతదేశం పట్ల ట్రంప్ వ్యవహారశైలి ఎలాఉంటుంది..? నరేంద్ర మోదీతో ఆయన సంబంధాలు గతంలోలానే కొనసాగుతాయా.. అనే అంశాలనుబట్టి భారత్ పై డొనాల్డ్ ట్రంప్ ప్రభావం ఏమేరకు ఉంటుందనేది రాబోయే కాలంలో తెలుస్తుంది. హెచ్1బి వీసాల విషయంలో త్వరలో అమెరికాతో భారత్ సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2025 చివరిలో భారత్ లో జరిగే క్వాడ్ సదస్సులో ట్రంప్ పాల్గొంటారని తెలుస్తోంది.