Israel Palestine Conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 10వేలు దాటిన మరణాలు, ఇందులో 4100 మంది పిల్లలే

Israel Palestine Conflict: శిథిలాల కింద సుమారు 2,000 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భారీ పరికరాలు, యంత్రాలు లేకపోవడంతో వారు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అల్ జజీరా పేర్కొంది

Israel Palestine Conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 10వేలు దాటిన మరణాలు, ఇందులో 4100 మంది పిల్లలే

Updated On : November 6, 2023 / 8:32 PM IST

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం నెల రోజులుగా సాగుతోంది. ఇరు ప్రాంతాల్లో భీకర యుద్ధ వాతావరణం ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి కనీసం 1400 మందికి చావుకు కారణమైంది. ఆ తర్వాత గాజా మీద యుద్ధానికి ఇజ్రాయెల్ ఉపక్రమించింది. కాగా ఇజ్రాయెల్ చేసిన ఈ దాడుల్లో 10,000 మంది పాలస్తీనీలు చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ఇందులో 4,100 మంది పిల్లలే ఉన్నారట. వీరే కాకుండా, వందలాది మంది శిథిలాల్లోనే చిక్కుకున్నారని, వారిప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదని అల్ జజీరా నివేదిక పేర్కొంది.

శిథిలాల కింద సుమారు 2,000 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భారీ పరికరాలు, యంత్రాలు లేకపోవడంతో వారు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అల్ జజీరా పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ దాడి కారణంగా ప్రజలు ఇంధనం, ఆహారం, విద్యుత్ వంటి నిత్యావసర వస్తువులను పొందలేకపోతున్నారట. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ ప్రభావాలు ఇప్పుడు లెబనాన్‌లో కూడా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై యాంటీ ట్యాంక్‌లతో హిజ్బుల్లా తీవ్రవాదులు నిరంతరం దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా లెబనాన్‌లోని కొంతమంది బ్రిటిష్ ఎంబసీ సిబ్బందిని తాత్కాలికంగా వెనక్కి పిలిపించాలని బ్రిటన్ నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: గాజా రెండు ముక్కలైందంటూ సంచలన ప్రకటన చేసిన ఇజ్రాయెల్

తక్కువ ఇంధన సరఫరా కారణంగా గాజాలోని 35 ఆసుపత్రుల్లో చాలా వరకు నిలిచిపోయాయి. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడిలో 25,000 మందికి పైగా గాయపడ్డారు. అదే సమయంలో గాజా నుంచి 15 లక్షలకు పైగా ప్రజలను తరలించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇదే సందర్భంలో ఒక పెద్ద వార్తను ఇజ్రాయెట్ ఆర్మీ బయటపెట్టింది. గాజాను రెండు ముక్కలు చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డేనియల్ హెన్రీ ప్రకటించారు. అంటే ప్రస్తుతం ఉన్న గాజా పట్టీని ఉత్తర గాజా, దక్షిణ గాజాగా విడగొట్టినట్లు ఆయన పేర్కొన్నారు.