ఏ నిమిషానికి ఏం జరుగునో : మళ్లీ తండ్రి అయిన బోరిస్

ఏ నిమిషానికి ఏం జరుగునో..అవును కొంతమంది జీవితాలు ఈ విధంగానే సాగుతాయి. మొన్నటి వరకు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడిన వ్యక్తి మళ్లీ తండ్రి అయ్యాడు. ఆ వ్యక్తే..బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్. కరోనా వైరస్ బారిన పడిన బోరిస్. . ఐసీయూలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.
ఇటీవలే పూర్తి ఆరోగ్యంగా కొలుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కోలుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇదే సమయంలో..కాబోయే భార్య క్యారీ సైమండ్స్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
క్యారీ సైమండ్స్ (32)తో కొంతకాలంగా బోరిస్ సహజీవనం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. బుధవారం లండన్ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారని వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని బోరిస్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
జాతీయ ఆరోగ్య సేవల మెటర్నరీ విభాగానికి ధన్యవాదాలు చెప్పినట్లు ప్రతినిధి తెలిపారు. పలువురు ప్రముఖులు బోరిస్ కు అభినందనలు తెలియచేస్తున్నారు. కాగా బోరిస్ జాన్సన్ కు తన మాజీ భార్య…మెరీనా వీలర్ తో ఇదివరకే నలుగురు సంతానం ఉన్నారు.
బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ 2020, ఏప్రిల్ 27వ తేదీ సోమవారం నుంచి విధులకు హాజరయ్యారు. కొన్ని రోజులు కరోనా వైరస్ కారణంగా ఆయన చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకున్నారు. పూర్తిగా కొలుకున్న తర్వాత..విధుల్లోకి హజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో బోరిస్ తిరిగి పగ్గాలు చేపట్టడం దేశానికి చాలా మంచిదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. బోరిస్ విధులకు దూరంగా ఉన్న సమయంలో ప్రధానిగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డొమినిక్ రాబ్ వ్యవహరించారు.