కొలంబో కకావికలం : 10 ఏళ్ల తర్వాత పేలుళ్లు

శ్రీలంక… ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నఈ దేశం ఇప్పుడు ఉగ్రదాడితో చిగురుటాకులా వణికిపోయింది. తమిళ ఈలం సమస్య సద్దుమణిగిన తర్వాత పదేళ్లుగా శాంతియుత వాతావరణంలో జీవిస్తున్న శ్రీలంక ప్రజలు వరుస పేలుళ్లు, ఆత్మాహుతి దాడులతో భయకంపితులయ్యారు. మళ్లీ పదేళ్ల తర్వాత గతంలో దేశంలో ఎల్టీటీఈ సృష్టించిన మారణహోమాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. ప్రశాంత జీవితంలో మళ్లీ అలజడి రేపిన దాడులతో జనం గత చేదు అనుభవాలను గుర్తు చేసుకుని ఉలిక్కిపడుతున్నారు.
ఒకప్పుడు తుపాకులు, బాంబుల మోతతో దద్దరిల్లేది. ఏ పట్టణంలో చూసినా వీధులన్నీ తరచూ రక్తసిక్తమయ్యేవి. తూటా గాయాలతో ఛిద్రమైన శరీరాలు కనిపించేవి.. కానీ.. ఇదంతా పదేళ్ల క్రితం మాట. 2009లో తమిళ వేర్పాటువాదుల గ్రూపు ఎల్‌టీటీఈని శ్రీలంక సైన్యం తుదముట్టించిన తర్వాత ఈ హింసకు తెరపడింది. పేలుళ్లు ఆగిపోయాయి. వ్యక్తుల అదృశ్యం ఘటనలు నిలిచిపోయాయి. ఒకప్పుడు రక్తంతో తడిచిన వీధులన్నీ ఇపుడు హోటళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లతో కళకళలాడుతున్నాయి. పర్యాటకులతో సందడిని సంతరించుకున్నాయి. అంతా ప్రశాంతం అనుకున్న టైమ్‌లో శ్రీలంక మళ్లీ బాంబు పేలుళ్లతో వణికిపోయింది.
Also Read : టీవీ నటి కూడా : మద్యం తాగి స్టేడియంలో యువతుల వీరంగం
క్రైస్తవ ప్రార్థనా స్థలాలు, విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఉండే హోటళ్లే లక్ష్యంగా జరిగిన దాడులతో శ్రీలంక దద్దరిల్లింది. ఈస్టర్ వేడుకల సందర్భంగా క్రైస్తవులంతా ప్రార్ధనలు చేస్తున్న సమయంలోనే ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మారణహోమం సృష్టించారు. శ్రీలంక చరిత్రలోనే ఇదే అతి పెద్ద ఉగ్రవాద దాడిగా భావిస్తున్నారు. పదేళ్లుగా ప్రశాంత జీవితం గడుపుతున్న శ్రీలంక ప్రజలు ఈ దాడులతో ఒక్కసారిగా వణికిపోయారు.
శ్రీలంకలో చిట్టచివరిసారి పేలుడు జరిగింది 2006లో. మిలటరీ లక్ష్యంగా ఈలం తీవ్రవాదులు చేసిన ఈ దాడిలో దాదాపు 120మంది సైనికులు మరణించారు. తమిళ ఈలం కోసం మూడు దశాబ్దాల పాటు సాయుధ పోరాటం చేసిన ఎల్టీటీఈ శకం 2009లో ముగిసింది. అంటే గడచిన పదేళ్ల కాలంగా శ్రీలంకలో ఎలాంటి హింసా చోటుచేసుకోలేదు. ముప్ఫై ఏళ్లపాటు కొనసాగిన మారణ హోమం ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ కాల్చివేతతో ముగిసింది. ఎనభైల ఆరంభం నుంచీ శ్రీలంక ప్రభుత్వంతో స్థిరయుద్ధం చేసిన ఎల్టీటీఈ వందల సంఖ్యలో పేలుళ్లకు పాల్పడింది. రక్తసిక్త చరిత్రకు మారు పేరుగా మారింది శ్రీలంక. శ్రీలంక పేరు వింటేనే భీతిగొలిపే హింస గుర్తు చేసుకున్న రోజులున్నాయి.
1983లో మొదలైన ఈలం పోరాటంలో దాదాపు లక్షా యాభై వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 27వేలమంది ఎల్టీటీఈ కార్యకర్తలు, 23వేల మంది సైన్యంతో పాటు వేలాది పౌరులు శ్రీలంక ప్రభుత్వానికి, ఎల్టీటీఈకి మధ్య జరిగిన పరస్పర దాడుల్లో మృతిచెందారు. అత్యంత శక్తివంతమైన 2వందల పేలుళ్లలో దాదాపు 47వేల మంది చనిపోయినట్టూ అంతర్జాతీయ యుద్ధ నిపుణులు అంచనా వేశారు. నాటి శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సా 2009 మే17న శ్రీలంక నేల మీద ఇక హింస ఉండదంటూ ప్రకటించారు. ఆ తర్వాత గడచిన పదేళ్లుగా శ్రీలంక వార్తల్లో చాలా అరుదుగా మాత్రమే దర్శనమిచ్చేది. తిరిగి మరో హింసాకాండతో శ్రీలంక వార్తల్లోకి రావడం విషాదమే అంటారు అంతర్జాతీయ పరిశీలకులు.
శ్రీలంకపై జరిగిన ఉగ్రవాదులు జరిపిన బాంబుపేలుళ్లలో ఇప్పటి వరకు 215 మంది మృతి చెందారు. 500కి పైగా గాయపడ్డారు. వరుస పేలుళ్లలో 35 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. ఒకటి రెండు కాదు..8 చోట్ల శక్తిమంతమైన బాంబు పేలుళ్లు బీభత్సం సృష్టించాయి. క్రైస్తవ ప్రార్థనా సంస్థలు, హోటళ్లను లక్ష్యంగా దాడులు జరిపారు.
Also Read : తగ్గని ఇంటర్ మంటలు : అన్నింట్లో 80.. లెక్కల్లో మాత్రమే 5 మార్కులు