Coronavirus : చైనాలో భారతీయుల కోసం విమానం రెడీ

కరోనా వైరస్ కారణంగా చైనాలోని వూహాన్‌లో చిక్కుకున్న భారతీయులందర్నీ మనదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగశాఖ సిద్ధమైంది. ప్రస్తుతం వూహాన్‌లో 700 మంది దాకా ఉన్నట్టు అంచనా. వారందర్నీ తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను బీజింగ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం చేపట్టింది.
చైనాలో విజృంభిస్తూ, ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటివరకు వ్యాధి కేంద్రంగా మారిన వుహాన్‌లోనే నమోదైన మరణాలు తాజాగా రాజధాని బీజింగ్‌కూ పాకాయి. మరో 1300 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్యశాఖ ప్రకటించింది. మొన్న ఒక్కరోజే 24 మంది మృత్యువాతపడ్డారని తెలిపింది. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య అధికారికంగా 4 వేల దాటిపోయినట్లు చెప్పింది.
మరోవైపు ప్రపంచ దేశాలకూ ఈ వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా జర్మనీ, శ్రీలంకలో తొలి కేసు నమోదైంది. ఆయా దేశాల్లో చైనా నుంచి వచ్చిన వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాలోని వుహాన్‌లో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానం పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చైనా ప్రభుత్వంతో బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. వుహాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
వుహాన్‌లో ఉన్న భారతీయులు తమ పాస్‌పోర్టు వివరాలను బీజింగ్‌లో ఉన్న భారత ఎంబసీ అధికారులకు అందజేయాల్సిందిగా కేంద్రం కోరింది. కేంద్రం ఆదేశాలు జారీ చేస్తే వుహాన్‌లో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. ఎయిరిండియా జెంబో విమానాన్ని అందుకు సిద్ధంగా ఉంచామని… ప్రభుత్వం ఆదేశాలు రావడమే ఆలస్యమని తెలిపింది.
కరోనా వైరస్ పుట్టుకొచ్చిన వుహాన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 700 మంది భారత విద్యార్థులు చదువుకుంటున్నారు. చైనా లునార్ నూతన సంవత్సరం సందర్భంగా సెలవులకు చాలామంది భారత్‌కు తిరిగొచ్చారు. ఇంకా 250-300 మంది విద్యార్థులు వుహాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌తో పాటు జపాన్ కూడా తమ దేశస్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు విమానాన్ని పంపించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
Read More : నంబాలే లీడర్ : మావోయిస్టు నూతన కేంద్ర కమిటీ జాబితా