Donald Trump: పాక్‌తో అమెరికా వాణిజ్య డీల్.. భారత్‌ పేరును ప్రస్తావిస్తూ డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్..

అగ్రరాజ్యం అమెరికా, పాకిస్థాన్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో భారత్ పేరును ప్రస్తావిస్తూ..

Donald Trump: పాక్‌తో అమెరికా వాణిజ్య డీల్.. భారత్‌ పేరును ప్రస్తావిస్తూ డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్..

Donald Trump

Updated On : July 31, 2025 / 10:28 AM IST

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా, పాకిస్థాన్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో భారత్ పేరును ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో భారత దేశానికి పాకిస్థానే నేరుగా చమురు విక్రయించ వచ్చునని చెప్పారు.

Also Read: Trump Tariffs And Penality: ఇండియాపై 25 శాతం టారిఫ్ తో పాటు పెనాల్టీ.. ఏంటీ పెనాల్టీ? భారత్‌కి నష్టం ఏంటి?

పాకిస్థాన్, అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.. ‘‘అమెరికా, పాకిస్థాన్ మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాలు చమురు నిల్వలను పెంచుకోవడంలో కలిసి పనిచేస్తాయి. అందుకోసం ఒక మంచి చమురు కంపెనీని ఎంచుకునే ప్రక్రియలో ఉన్నాం. ఈ ఒప్పందం కారణంగా భవిష్యత్తులో బహుశా భారతదేశానికి పాకిస్థాన్ చమురు విక్రయించొచ్చు.’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు. భారత దిగమతులపై 25శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు.. సుంకాల భారాన్ని తగ్గించుకునేందుకు అమెరికాకు ఆయా దేశాలు ఆఫర్లు చేస్తున్నాయని, ఇవన్నీ వాణిజ్య లోటును తగ్గించడంలో సహాయపడుతాయని ట్రంప్ పేర్కొన్నాడు.

ఆగస్టు 1 నుంచి అమల్లోకి..
భారత్ తమకు మిత్ర దేశమంటూనే అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25శాతం పన్నులను విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అదనంగా జరిమానాలూ ఉంటాయని చెప్పారు. ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే రష్యా నుంచి భారీగా సైనిక ఉత్పత్తులు, చమురు కొనుగోలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రష్యాతో వాణిజ్యం కారణంగా 25శాతం సుంకాలతోపాటు పెనాల్టీ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ప్రకటనపై భారత్ స్పందించింది. సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

టారిఫ్‌ల పెంపు ప్రకటన తరువాత మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌కు వ్యతిరేకంగా, డాలర్‌ను అణగదొక్కాలని బ్రిక్స్ దేశాలు చూస్తున్నాయని ఆరోపించిన ట్రంప్.. భారత్ కూడా ఆ కూటమిలో భాగమేనన్నారు. కానీ, అది జరగనివ్వనని స్పష్టం చేశారు.

అయితే, తాజాగా ట్రంప్ ట్రూత్ సోషల్ లో పెట్టిన పోస్టులో.. ‘‘ఈరోజు వైట్‌హౌస్‌లో ట్రేడ్ డీల్స్ పై పనిచేస్తూ చాలా బిజీగా ఉన్నాము. నేను చాలా దేశాల నాయకులతో మాట్లాడాను. వారందరూ అమెరికాను చాలా సంతోషపెట్టాలని కోరుకుంటున్నారు. నేను ఇవాళ మధ్యాహ్నం దక్షిణ కొరియా వాణిజ్య ప్రతినిధి బృందాన్ని కలుస్తాను. దక్షిణ కొరియాపై 25శాతం సుంకం విధించడం జరిగింది.. కానీ, వారి వద్ద ఆ సుంకాలను తగ్గించే ఆఫర్ ఉంది. ఆ ఆఫర్ ఏమిటో వినడానికి నేను ఆసక్తిగా ఉన్నాను. అదేవిధంగా, ఇతర దేశాలు టారిఫ్ తగ్గింపు కోసం ఆఫర్లు ఇస్తున్నాయి. ఇవన్నీ మన వాణిజ్య లోటును చాలా పెద్ద స్థాయిలో తగ్గించడంలో సహాయపడతాయి. తగిన సమయంలో పూర్తి నివేదిక విడుదల చేయబడుతుంది’’ అని ట్రంప్ అన్నారు.