దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి భారత యుద్ధనౌక… చైనా ఊహించనేలేదు….

ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో.. అనే స్థాయిలో చైనాకు భారత్ షాకుల మీద షాకులిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదం తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలకు ప్రతీకగా పలు నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. డేటా దొంగతనానికి పాల్పడిన కారణంగా టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్‌లను నిషేధించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రద్దుతో చైనా కంపెనీలపై భారీ దెబ్బకొట్టింది. వారిని భారత ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి తప్పిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే నేరుగా చైనా కంపెనీలకు అవకాశం లేదని చెప్పకుండా… భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలకు చెందిన కంపెనీలకు భారతీయ కాంట్రాక్టుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇది చైనాను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయమే అని అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెస్తున్న ఆంక్షలతో చైనాతో పాటు ఆ దేశానికి వంత పాడుతూ భారత్‌కు సమస్యలు సృష్టిస్తున్న డ్రాగన్ మిత్రులపైనా ప్రభావం పడబోతోంది.
కేంద్రం ప్రకటన బట్టి చూస్తే చైనాతో పాటు ఆ దేశానికి సహకరిస్తున్న పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ పైనా ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. నేపాల్, బంగ్లాదేశ్ సంగతి ఎలా ఉన్నా… ఈ ఆంక్షల ప్రభావం కచ్చితంగా చైనా, పాకిస్తాన్ పై పడుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఇకపై ఈ దేశాలకు చెందిన సంస్ధలేవీ భారత ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం కానీ, భాగస్వాములు కావడం కానీ జరగకుండా కేంద్రం ఆంక్షలు ప్రభావం చూపబోతున్నాయి.
చైనా, పాకిస్థాన్‌లకు తమ దేశాల్లో అంతర్గత సమస్యలు తలెత్తినప్పుడు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడం అలవాటు. ఇప్పుడు చైనాలో అంతర్గత సమస్యలు రావడంతోనే దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ లాంటి దేశాలతోనూ ఘర్షణలకు దిగుతోంది. చైనా తన వైఖరితో ప్రపంచ వ్యాప్తంగా అపఖ్యాతి పాలైంది.
దీనికితోడు కశ్మీర్ విషయంలో కొత్త చట్టాలు తెచ్చాం. అక్కడి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. పీవోకే గురించి గట్టిగా మాట్లాడుతున్నాం. ఆక్సాయ్ చిన్ మనదే అని, అది చైనా ఆక్రమించిందని పార్లమంటులోనే కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. గాల్వన్ లోయ దేశ రక్షణ విషయంలో స్ట్రాటజిక్ పాయింట్. అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. ఇది చైనాకు నచ్చడం లేదు. అందుకే ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
డ్రాగన్ కంట్రీని దెబ్బకొట్టేలా మోదీ సర్కార్ వ్యూహాలు :
కరోనా నేపథ్యంలో ఆత్మ నిర్భర భారత్ కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కానీ చైనా మాత్రం మనం అన్య నిర్భర్ భారత్‌గానే ఉండాలని కోరుకుంటోంది. భారత్ ఎదగడం చైనాకు ఇష్టం లేదు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేయడం చైనా భరించలేక పోతోంది. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండి, స్థిరంగా ఆర్థికాభివృద్ధి జరగడాన్ని చైనా ఓర్వలేకపోతోందని… అందుకే ఈ గొడవలు సృష్టిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కరోనా వైరస్‌కు చైనాయే కారణమనే ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. దీంతో అనేక మల్టీ నేషనల్ కంపెనీలు చైనాలో ఉన్న తమ యూనిట్లను తరలించాలని, తమ పెట్టుబడుల్ని భారత్‌కు మళ్లించాలని భావిస్తున్నాయి. భారత్‌లో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు బాగా అమలు అవుతున్నాయి. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా బాగా పెరుగుతున్నాయి. 2014 నుంచి 2017 వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 36 బిలియన్ డాలర్ల నుంచి 61 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది డ్రాగన్ కంట్రీకి నచ్చడం లేదు. అందుకే ఇక్కడ అశాంతి రగిలించాలని యత్నిస్తోంది.
ఆత్మ నిర్భర భారత్‌తో వణికిపోతున్న చైనా :
మరోవైపు గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకుని ఆర్థికంగా లాభపడాలన్న చైనా చేస్తున్న నక్కజిత్తులు ఇప్పట్లో ఫలించేలా లేదు. మరోసారి చైనా విషయంలో భారత్ తన కఠిన వైఖరిని తేటతెల్లం చేసింది. రష్యా వేదికగా త్వరలో జరగనున్న పలుదేశాల సంయుక్త సైనిక విన్యాసాల నుంచి భారత్ వైదొలిగింది.
చైనా, పాకిస్థాన్ కూడా ఈ సంయుక్త విన్యాసాల్లో పాలుపంచుకోనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విదేశాంగ మంత్రి జైశంకర్, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రష్యాలో జరిగే పలుదేశాల సైనిక విన్యాసాల కార్యక్రమంలో భారత దళాలు పాల్గొనాలా? వద్దా? అన్న అంశంపై చర్చించారు.
ఇందులో చైనా, పాకిస్థాన్ సేనలు కూడా పాల్గొంటున్నందున.. అందులో మనం పాల్గొనడం సరికాదని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం రష్యాకు తెలియజేసింది. రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా సమస్య కూడా తమ నిర్ణయానికి కారణమని భారత్ రష్యాకు తెలిపినట్లు సమాచారం. కాగా సెప్టెంబర్ 4-6 తేదీ వరకు జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాకు వెళ్లనున్నారు. అయితే ఈ సందర్భంగా చైనా ప్రతినిధులతో భారత ప్రతినిధులు ఎలాంటి చర్చలు జరపబోరని తెలుస్తోంది.
ఈ సందర్భంగా దేశ సరిహద్దుల్లో చైనా రెచ్చగొట్టే చర్యలను భారత ప్రతినిధులు లేవనెత్తే అవకాశమున్నట్లు సమాచారం. మొత్తానికి నిన్న మొన్నటిదాకా మనతోనే వ్యాపారం చేసి ఎదిగిన చైనా… ఇప్పుడు భారత్ ఆత్మ నిర్భర్ దిశగా ఎదుగడాన్ని తట్టుకోలేకపోతోంది. అందుకే సరిహద్దుల్లో కుట్రలకు తెరలేపి భారత్‌ను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తోంది. చైనా దూకుడుకు దీటుగా భారత్ కూడా ఎదురు నిలబడటంతో డ్రాగన్ కంట్రీ ఏం చేయాలో పాలుపోని స్థితిలో కూరుకుపోయింది.