More Sanctions On Russia : బుచ్చాలో మారణహోమం.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామన్న ఈయూ

కీవ్ సమీపంలోని బుచ్చాలో రష్యా దళాలు సాగించిన మారణహోమాన్ని యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్ ఖండించారు.(More Sanctions On Russia)

More Sanctions On Russia : బుచ్చాలో మారణహోమం.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామన్న ఈయూ

More Sanctions On Russia (1)

Updated On : April 3, 2022 / 7:14 PM IST

More Sanctions On Russia : సైనిక చర్య పేరుతో యుక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం కొనసాగిస్తోంది. నెల రోజులకు పైగా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. యుక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాటమార్చింది. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సరిహద్దులు, చెర్నిహివ్‌లోని జనావాసాలపై క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో తమపై రష్యా యుద్ధం ముగిసిపోలేదని అర్థమవుతోందని యుక్రెయిన్ అంటోంది. 39వ రోజు కూడా యుక్రెయిన్ లో కొన్ని చోట్ల రష్యా బలగాల దాడులు కొనసాగాయి.

ఇది ఇలా ఉంటే.. యుక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని బుచ్చాలో రష్యా దళాలు సాగించిన మారణహోమాన్ని యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్ ఖండించారు. బుచ్చాలో రష్యా సైన్యం చేసిన దురాగతాల చిత్రాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యా అని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ దారుణాలపై అంతర్జాతీయ న్యాయస్థానాల్లో విచారణకు అవసరమైన సాక్ష్యాలను సేకరించడంలో ఈయూ.. యుక్రెయిన్, స్వచ్ఛంద సంస్థలకు సాయం చేస్తోందని చెప్పారు. ఈయూ దేశాలు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు వెల్లడించారు.(More Sanctions On Russia)

Russian Soldiers Die : యుద్ధంలో 18వేల మంది రష్యా సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ

మరోవైపు.. రష్యాపై మరిన్ని ఆంక్షలను విధించాలని జీ7 దేశాలు డిమాండ్‌ చేశాయి. చమురు, గ్యాస్, బొగ్గు దిగుమతులపై నిషేధం విధించడంతోపాటు రష్యన్ నౌకలు, సరకులను అడ్డుకునేందుకు అన్ని నౌకాశ్రయాలను మూసివేయాలని, స్విఫ్ట్‌ నుంచి అన్ని రష్యన్ బ్యాంకులను డిస్‌కనెక్ట్ చేయాలని కోరాయి.

కీవ్ ప్రాంతాన్ని 21వ శతాబ్దపు నరకంగా ఉక్రెయిన్‌ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్‌ అభివర్ణించారు. నాజీ నాటి దారుణ నేరాలు రష్యాకు తిరిగొచ్చాయని విమర్శించారు. ఇదంతా రష్యా ఉద్దేశపూర్వకంగానే చేసిందని ఆరోపించారు. వెంటనే రష్యాపై ఆంక్షలు విధించాలన్నారు.

కీవ్‌ సమీపంలోని బుచ్చాలో పౌరులపై రష్యా సేనల దారుణాలు ఉద్దేశపూర్వకంగా చేసినవేనని యుక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆరోపించారు. ‘వీలైనంత ఎక్కువ మంది ఉక్రెనియన్లను తుడిచిపెట్టాలని రష్యన్‌ బలగాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. వారి ఆగడాలను అడ్డుకోవాలి. వారిని తరిమి కొట్టాలి’ అని ట్వీట్‌ చేశారు.(More Sanctions On Russia)

Vladmir Putin: పుతిన్ కు క్యాన్సర్, జింక కొమ్ముల రక్తంతో స్నానం చేస్తాడు: రష్యా పత్రిక సంచలన ప్రకటన

కాగా, బుచ్చా పట్టణంలో పౌర మరణాల నివేదికలు ఫేక్‌ అని రష్యా రక్షణ శాఖ తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్‌లో ఓ నివేదికను షేర్‌ చేసింది. ‘మార్చి 30న రష్యా బలగాలు ఆ నగరాన్ని విడిచిపెట్టాయి. ఈ నాలుగు రోజులు ఆ ఫొటోలు ఎక్కడ ఉన్నాయి?’ అని ఆ రిపోర్టులో ప్రశ్నించినట్లు ఉంది. బుచ్చాలో తీసినట్లుగా చూపెడుతున్న వీడియో నకిలీదని తెలుస్తోందని, ఫుటేజీలోని మృతదేహాలు కదులుతున్నట్లు ఉన్నాయని చెప్పింది.

ఇది ఇలా ఉంటే.. దక్షిణ యుక్రెయిన్‌లోని పోర్ట్‌ సిటీలపై రష్యా దృష్టి సారించిందా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. ఆదివారం ఉదయం ఒడెస్సా నగరంపై రష్యా క్షిపణులు విరుచుకుపడగా.. తాజాగా మైకోలైవ్‌పైనా మిస్సైల్‌ దాడులు జరిగినట్లు స్థానిక మేయర్‌ ఒలెక్సాండర్‌ సెన్‌కెవిచ్‌ తెలిపారు. మైకోలైవ్ నౌకాశ్రయంపై దాడి జరిగినట్లు దేశ అంతర్గతశాఖ ప్రతినిధి అంటోన్ గెరాష్చెంకో సైతం వెల్లడించారు. యుక్రెయిన్‌కు నల్ల సముద్రం యాక్సెస్‌ను కత్తిరించేందుకు రష్యన్‌ బలగాలు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

రష్యా సైనిక చర్య ప్రభావం.. యుక్రెయిన్‌ పంట ఎగుమతులపైనా పడింది. మార్చిలో యుక్రెయిన్‌ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఫిబ్రవరితో పోల్చితే నాలుగు రెట్లు పడిపోయిందని ఆర్థిక శాఖ తెలిపింది. విదేశాలకు 11 లక్షల టన్నుల మొక్కజొన్న, మూడు లక్షల టన్నుల గోధుమలు, లక్ష టన్నుల సన్‌ఫ్లవర్‌ నూనెను ఎగుమతి చేసినట్లు వెల్లడించింది. ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ డేటా ప్రకారం.. 2020-2021లో ఉక్రెయిన్… ప్రపంచంలోని నాల్గో అతిపెద్ద ధాన్యం ఎగుమతిదారుగా ఉంది. అయితే, తీరప్రాంతాల్లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. వ్యాపారులు రైలు మార్గాలను ఎంచుకుంటున్నారు.