Imran Khan Pakistan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్‌షాక్‌.. పీటీఐ పార్టీపై ఈసీ నిషేధం?

పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారిక రహస్య పత్రాలను అక్రమంగా చేరవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది.

Imran Khan Pakistan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్‌షాక్‌.. పీటీఐ పార్టీపై ఈసీ నిషేధం?

Imran Khan

Pakistan former PM Imran Khan : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారిక రహస్య పత్రాలను అక్రమంగా చేరవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌ఖాన్‌ నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. తాజా తీర్పుతో ఇమ్రాన్‌కు చెందిన తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ పార్టీపై.. ఎన్నికల సంఘం నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

Also Read : CM Revanth Reddy : ఫిబ్రవరి 2నుంచి ప్రజల్లోకి.. మార్చి 3వరకు లోక్ సభ సీటుకోసం దరఖాస్తులు చేసుకోవచ్చు

అసలేం జరిగింది..?
2022లో ప్రధాన పదవి నుంచి దిగిపోయే ముందు ఇమ్రాన్‌ఖాన్‌ ఓ ర్యాలీలో మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అగ్రరాజ్యం అమెరికా కుట్రపన్నిందన్న ఆయన.. అమెరికా ఆదేశాలకు అనుగుణంగా పాకిస్థాన్ మిలిటరీ ప్రభుత్వం నడుచుకుంటోందని ఆరోపించారు. వాటికి ఆధారాలున్నాయంటూ కొన్ని పత్రాలను ప్రదర్శించారు‌. అయితే.. ఆ పత్రాలన్నీ అమెరికాలోని పాకిస్థాన్‌ ఎంబసీ నుంచి సేకరించినట్లు ప్రకటించారు. దీంతో దేశ రహస్య చట్టాలను ఉల్లంఘించారని ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు ఖురేషీపై పాకిస్థాన్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన స్పెషల్‌ కోర్టు.. ఇద్దరినీ దోషులుగా తేల్చి పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే.. దీనిపై ఇమ్రాన్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించింది. అంతేకాదు. ఫిబ్రవరి 8న జరగనున్న ఎన్నికల నేపథ్యంలోనే అక్రమంగా కేసులు బనాయించారని తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read : YS Sharmila: ప్రధాని నరేంద్ర మోదీకి షర్మిల లేఖ.. ఆ వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్

పార్టీపై పూర్తిగా నిషేధం?
పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కాన్‌ దోషిగా తేలడం ఇది రెండో కేసు. తోషాఖానా కేసులో ట్రయల్‌ కోర్టు కోర్టు ఆయనకు మూడు ఏళ్ల జైలు శిక్ష విధించగా.. ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆ శిక్షను రద్దు చేసింది. ఆ తర్వాత సైఫర్ కేసుతోపాటు దాదాపు 150 కేసులు ఆయనపై నమోదు కావడంతో ఇమ్రాన్‌ఖాన్‌ జైలులోనే ఉన్నారు. పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. జైలు నుంచే పోటీ చేసేందుకు ఇమ్రాన్‌ఖాన్‌ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రెండు నియోజకవర్గాల నుంచి ఆయన దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. కేసుల నేపథ్యంలో ఆయన పార్టీకి ఉన్న బ్యాటు గుర్తును కూడా రద్దు చేసింది ఈసీ. తాజా తీర్పు నేపథ్యంలో ఆయన పార్టీపై పూర్తిగా నిషేధం విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ నేత, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. మూడుసార్లు పాక్‌ ప్రధానిగా పనిచేసిన నవాజ్‌ షరీఫ్‌ను 2017లో పీఎం పదవి నుంచి తొలగించారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు ముమ్మరం చేసిన నవాజ్‌ షరీఫ్‌కు.. ఇమ్రాన్‌ జైలు శిక్ష అనుకూలంగా మారే అవకాశముంది.