CM Revanth Reddy : ఫిబ్రవరి 2నుంచి ప్రజల్లోకి.. మార్చి 3వరకు లోక్ సభ సీటుకోసం దరఖాస్తులు చేసుకోవచ్చు

వచ్చే 60 రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఆ ఎన్నికల్లో మంచి ఫలితాలకోసం కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ ప్రెసిడెంట్, సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

CM Revanth Reddy : ఫిబ్రవరి 2నుంచి ప్రజల్లోకి..  మార్చి 3వరకు లోక్ సభ సీటుకోసం దరఖాస్తులు చేసుకోవచ్చు

CM Revanth Reddy

CM Revanth Reddy Pressmeet : వచ్చే 60 రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఆ ఎన్నికల్లో మంచి ఫలితాలకోసం కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ ప్రెసిడెంట్, సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీ భవన్ లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశం తెరపైకి వచ్చింది. ఎన్నికల ముందు పార్టీ వీడినవారు తిరిగి పార్టీలోకి రావొచ్చని, ఎలాంటి కండిషన్ లేకుండా రావాలని సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా మెదక్ లోక్ సభ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి పీఈసీని కోరినట్లు తెలిసింది. ఈ సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను హై కమాండ్ కి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు రేవంత్ తెలిపారు. లోక్ సభ లో పోటీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోందని, మార్చి 3వ తేదీ వరకు లోక్ సభ సీటు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చునని రేవంత్ తెలిపారు. ధరఖాస్తుల స్క్రూట్నీకోసం ప్రత్యేక కమిటీ వేయడం జరిగిందని తెలిపారు. జనరల్ స్థానాలకు దరఖాస్తు ఫీజు 50 వేలు కాగా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ధరఖాస్తు ఫీజు 25 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. 17 పార్లమెంట్ సెగ్మెంట్ లకు మంత్రులను, ఇంచార్జీ లను ఇప్పటికే నియమించినట్లు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

Also Read : YS Sharmila: ప్రధాని నరేంద్ర మోదీకి షర్మిల లేఖ.. ఆ వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్

హామీల అమలులో మోదీ విఫలం..
దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దేశంగా ఇండియా అవ్వడం మోదీ ఘనతేనని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటికూడా అమలు చేయలేదని, కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకొని ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి ప్రభుత్వాలను కూల్చడంలో బీజేపీ ఘనత సాధించిందని రేవంత్ విమర్శలు చేశారు. దేశ ప్రజల మీద మోదీ ప్రభుత్వం వంద లక్షల కోట్ల అప్పులు మోపిందని అన్నారు. మణిపూర్ లో అంతపెద్ద ఘటన జరిగితే మోదీ అక్కడికి వెళ్లలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సచ్చింది..
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదని, ఆ పార్టీ సచ్చిందని రేవంత్ అన్నారు. దేశానికి బీజేపీ ప్రమాదకరంగా మారిందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని అన్నారు. బిల్లా – రంగాలు అన్నట్లు బీజేపీ – బీఆర్ఎస్ లు మారాయని, బీఆర్ఎస్ పార్టీకి ఓటువేస్తే మూసిలో వేసినట్లేనని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ లాంటి నాయకుడు దేశానికి ప్రధాని అవ్వడం అవసరమని రేవంత్ పేర్కొన్నారు.

Also Read : Gyanvapi : జ్ఞానవాపి మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలు గుర్తించిన మైసూరు పురావస్తు శాఖ

17లోక్ సభ సీట్లు గెలవాలి..
కాంగ్రెస్ హామీల అమలు జరగాలంటే 17 లోక్ సభ సీట్లు గెలవాలని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే కాంగ్రెస్ హామీలు తెలంగాణలో హామీలు అమలు జరుగుతాయని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అంటే వాళ్లు మాటలు పిచ్చిమాటలేనని రేవంత్ అన్నారు. మోదీతో కేసీఆర్ చీకటి చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఎవరు అడిగినా అపాయింట్ మెంట్ ఇస్తాను, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులకు కూడా సమయం ఇస్తానని రేవంత్ అన్నారు. బడ్జెట్ లో హామీలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని తెలిపారు. ఇరిగేషన్ శాఖపై వచ్చే అసెంబ్లీ సమావేశంలో శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. ఇరిగేషన్ శాఖపై విజిలెన్స్ మొదలైందని, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చట్ట ప్రకారం విచారణ మొదలు పెట్టిందని అన్నారు. గద్దర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా జరుపుతోందని రేవంత్ అన్నారు.