లండన్‌లో ఎంజాయ్ చేసిన ఆర్థిక నేరస్థులు లలిత్ మోదీ, విజయ్ మాల్యా.. ఇద్దరూ కలిసి పాట కూడా పాడారు.. వీడియో వైరల్
ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో గాయకుడు కార్ల్‌టన్ బ్రగాన్జా, క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ కూడా ఉన్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ఇటీవల లండన్‌లో సమ్మర్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిపి మొత్తం 310 మంది హాజరయ్యారు. వీరిలో పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కూడా ఉన్నారు. లలిత్ మోదీ, విజయ్ మాల్యా ఆర్థిక నేరస్థులన్న విషయం తెలిసిందే.
లలిత్ మోదీ తన లండన్‌లోని ఇంట్లో నిర్వహించిన ఈ పార్టీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. లలిత్ మోదీ, విజయ్ మాల్యా కలిసి పాట పాడారు.
“ఈ వేడుక కోసం ప్రత్యేకంగా ప్రయాణించి వచ్చిన 310 మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య గడిపాను. ఈ రోజును గుర్తుండిపోయేలా చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు” అని లలిత్ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో గాయకుడు కార్ల్‌టన్ బ్రగాన్జా, క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ కూడా ఉన్నారు. లలిత్ మోదీ కోసం గేల్ ఒక బ్యాట్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి.
ఫ్రాంక్ సినాట్రా ‘I Did It My Way’ అనే పాటను లలిత్ మోదీ, మాల్యా కలిసి కరియోకేలో పాడడమే ఈ పార్టీ హైలైట్.
కాగా, లలిత్ మోదీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) మాజీ ఉపాధ్యక్షుడు. ఆయనపై టెండర్ ప్రక్రియలో అక్రమాలు, మనీ లాండరింగ్, విదేశీ మారకద్రవ్య చట్టం (FEMA) ఉల్లంఘనల ఆరోపణలున్నాయి. 2010లో భారత్ విడిచి పారిపోయారు. అప్పటి నుంచి లండన్‌లో నివసిస్తున్నారు.
విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమాని. ఆయనపై రూ.9,000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత ఆరోపణలున్నాయి. 2016లో భారతదేశం నుంచి యూకేకి వెళ్లిపోయారు. 2019లో భారత ప్రభుత్వం అతడిని పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించింది. అప్పటి నుంచీ మాల్యా యూకేలోనే ఉంటున్నారు.
View this post on Instagram