Indonesia New Law : పెళ్లికి ముందు శారీరకంగా కలిసినా, సహజీవనం చేసినా జైలు శిక్ష.. ఆ దేశంలో అమల్లోకి కొత్త చట్టం..
Indonesia : కొత్త నిబంధనల ప్రకారం.. వివాహం చేసుకోకుండా శారీరకంగా కలవడం నేరంగా పరిగణిస్తారు. అలాగే పెళ్లి కాకుండా జంటలు ఒకే ఇంట్లో కలిసి ఉండటం కూడా చట్ట విరుద్ధం.
Indonesia New Law
- ఇండోనేషియాలో అమల్లోకి కొత్తచట్టం
- పెళ్లికి ముందు శారీరక సంబంధం పెట్టుకుంటే ఏడాది జైలు శిక్ష
- సహజీవనం చేసినా జైలు కెళ్లాల్సిందే
- పర్యటకులకు కూడా వర్తించనున్న నిబంధనలు
Indonesia New Law : ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక స్వర్గధామంగా పేరొందిన ఇండోనేషియా తన దేశ చట్టాల్లో భారీ మార్పులు చేసింది. తాజాగా కొత్త చట్టాల నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దశాబ్దాల కాలం నాటి పాత డచ్ చట్టాల స్థానంలో కొత్త స్వదేశీ శిక్షాస్మృతిని అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఆ దేశంలో తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

కొత్త శిక్షాస్మృతి ప్రకారం.. వివాహం చేసుకోకుండా శారీరకంగా కలవడం నేరంగా పరిస్తారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే గరిష్ఠంగా ఏడాది జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే పెళ్లి కాకుండా జంటలు ఒకే ఇంట్లో కలిసి ఉండటం కూడా చట్ట విరుద్ధం. సహజీవనం కేసుల్లో ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని చట్టం స్పష్టం చేస్తోంది.
క్రిమినల్ కోడ్ సవరణను 2022లో ప్రకటించారు. అయితే, 2026 జనవరి 2వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇండోనేషియా పార్లమెంట్ ఆమోదించిన కొత్త నియామాల్లో పెళ్లి కాకుండా సెక్స్, సహజీవనంపై నిషేధం విధించారు.
కొత్త చట్టాల ప్రకారం.. పెళ్లికి ముందు శారీరకంగా కలవడం కేసుల్లో ఎవరిపడితే వాళ్లు ఫిర్యాదు చేయడానికి వీళ్లేదు. వివాహితులైతే బాధితుల జీవిత భాగస్వామి లేదా వారి పిల్లలు సమర్పించిన ఫిర్యాదుపై అధికారులు చర్యలు తీసుకుంటారు. బాధితులు అవివాహితులైతే వారి తల్లిదండ్రులు సమర్పించిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేస్తారు.

కొత్త నిబంధనలు ఇండోనేషియా పౌరులకే కాదు.. ఆ దేశంకు వెళ్లే విదేశీ పర్యాటకులకు వర్తిస్తాయట. ఆ దేశంలోని బాలి వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు భారతదేశం నుంచేకాక ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. వారు కూడా నూతన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. తాజా నిబంధనల కారణంగా దేశంలో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని అక్కడి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాలి గవర్నర్ వాయన్ కోస్టర్ మాట్లాడుతూ.. బాలి ఎప్పటిలాగే ఉంటుంది. దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలతో పర్యాటకులపై ప్రభావం చూపుతుందని మేము భావించడం లేదని అన్నారు. పర్యాటకులు తమ వైవాహిక స్థితిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, అధికారులు తనిఖీ చేయరని పేర్కొన్నారు. విదేశీ పౌరుడు స్థానికులతో డేటింగ్ చేస్తుంటే, వారి తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు ఫిర్యాదు చేస్తే చట్టం వారిపై ప్రభావం చూపుతుందని చెప్పారు. అప్పుడు అది సమస్య అవుతుందని అన్నారు. ఇండోనేషియా డిప్యూటీ జస్టిస్ మంత్రి ఎడ్వర్డ్ ఒమర్ షరీఫ్ హియారిజ్ మాట్లాడుతూ.. కొత్త చట్టంతో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.
