Israel-Hamas ceasefire : గాజా యుద్ధం ముగింపు.. మొదటి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ సంతకం.. డొనాల్డ్ ట్రంప్ కీలక కామెంట్స్..
Israel-Hamas ceasefire : రెండేళ్ల గాజా యుద్ధానికి ఎండ్ కార్డు పడింది. గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్‌లు

Israel Hamas ceasefire
Israel-Hamas ceasefire : రెండేళ్ల గాజా యుద్ధానికి ఎండ్ కార్డు పడింది. గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్‌లు అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
మరోవైపు.. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పందించారు. ఈ శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ కు ఎంతో మంచి చేస్తుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు, బందీలను ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వాన్ని సమావేశపరుస్తామని పేర్కొన్నారు. హమాస్ నాయకత్వం కూడా స్పందించింది. గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని హమాస్ నాయకత్వం అభిప్రాయపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ధన్యవాదాలు తెలిపింది.
Also Read: రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన.. ఈ సారి ముగ్గురికి.. వీళ్లు దేనిపై కృషి చేశారంటే?
గాజా యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్, హమాస్‌లు ముందుకొచ్చి.. మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం సోషల్ ట్రూత్‌లో ట్రంప్ పోస్టు చేశారు. ‘మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించినందుకు గర్వంగా ఉంది. దీర్ఘకాలిక శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలుస్తుంది. అమెరికా, అరబ్ ప్రపంచం, ముస్లిం దేశాలు, ఇజ్రాయెల్, చుట్టుపక్కల దేశాలకు ఇది చాలా మంచి రోజు. ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, ఈజిప్ట్, టర్కీలకు ధన్యవాదాలు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
సోమవారం బందీలు విడుదల కావొచ్చు : ట్రంప్
గాజాలో యుద్ధం విరమణకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరిస్తూ సంతకాలు చేసిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్‌లు ప్రపంచానికి శాంతిని తీసుకొచ్చాయని అన్నారు. శాంతి ఒప్పందం ప్రకటన తరువాత ఇజ్రాయెల్ ప్రధానితో చర్చలు జరిపినట్లు ట్రంప్ వెల్లడించారు. సోమవారం బందీలు విడుదల కావొచ్చునని ట్రంప్ పేర్కొన్నారు.
గాజాలో యుద్ధాన్ని ముగించే ఒప్పందం యొక్క మొదటి దశలో భాగంగా హమాస్ 2,000 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా 20 మంది జీవించి ఉన్న బందీలను విడుదల చేస్తుందని ఉగ్రవాద సంస్థలోని ఒక వర్గాలు తెలిపాయి . ఒప్పందం అమలు అయిన 72 గంటల్లోపు ఈ విడుదల జరుగుతుంది.
2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. 1200 మందికిపైగా హతమార్చి, 250 మందికిపైగా బందీలుగా చేసుకున్నారు. ఆ తరువాత ఇజ్రాయెల్ బలగాలు హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై భీకర దాడులకు దిగాయి. హమాస్ ముఖ్య నేతలను హతమార్చారు. ఈ రెండేళ్ల యుద్ధకాలంలో 67వేల మందికిపైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. 1.70లక్షల మంది గాయపడ్డారు. లక్షలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకొని హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చారు. తాజాగా.. మొదటి దశ శాంతి ఒప్పందంలో భాగంగా హమాస్, ఇజ్రాయెల్ సంతకాలు చేసినట్లు ట్రంప్ ప్రకటించారు.