Japan: ఉత్తరకొరియా క్షిపణిని పరీక్షిస్తే పేల్చేయడానికి సన్నద్ధమవ్వాలి: మిలటరీకి జపాన్ ఆదేశం
Japan: ప్రస్తుతం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి.

North Korea
Japan: ఉత్తరకొరియా (North Korean) ఖండాంతర క్షిపణిని పరీక్షిస్తే దాన్ని పేల్చేయడానికి సన్నద్ధంగా ఉండాలని తమ మిలటరీకి జపాన్ (Japan) ఆదేశాలు ఇచ్చింది. జపాన్ వైపుగా ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో జపాన్ ప్రజలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరకొరియా అంతటితో ఆగకుండా తాము కొన్ని రోజుల్లో మొట్టమొదటి మిలటరీ స్పై శాటిలైట్ (military spy satellite) ను ప్రయోగించినున్నట్లు ప్రకటన చేసింది.
కక్ష్యలోకి శాటిలైట్ ను ప్రవేశపెట్టాలంటే దీర్ఘశ్రేణి ప్రక్షేపం (projectile) అవసరం ఉంటుంది. అటువంటివి వాడకుండా ఉత్తరకొరియాపై ఆంక్షలు ఉన్నాయి. దీంతో తమ దేశ మిలటరీకి జపాన్ మంత్రి యసుకాజు హమదా కీలక సూచనలు చేశారు. ఖండాంతర క్షిపణులు, ఇతర అస్త్రాలను నాశనం చేయాలని ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. క్షిపణి వచ్చి పడితే నష్టం వీలైనంత తక్కువగా ఉండేందుకు ఈ ప్రతి చర్యలు తప్పనిసరని తెలిపారు.
SM-3 వ్యవస్థలతో క్షిపణులను ధ్వంసం చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వాటిని మోహరించేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. 2012, 2016లోనూ ఉత్తరకొరియా పరీక్షించిన ఖండాంతర క్షిపణులు జపాన్ లోని ఒకినావా ప్రాంతం మీదుగా వెళ్లాయి. 2012లో మిలటరీకి జపాన్ ఏ విధమైన ఆదేశాలు ఇచ్చిందో, ఇప్పుడు కూడా అవే ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి.
Encounter : మధ్యప్రదేశ్ బాలాఘాట్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి