Temple In Pakistan : పాకిస్తాన్​లో మరో ఆలయంపై దాడి..విగ్రహాల ధ్వంసం

పాకిస్తాన్​లో హిందూ ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయి.

Temple In Pakistan : పాకిస్తాన్​లో మరో ఆలయంపై దాడి..విగ్రహాల ధ్వంసం

Pak

Updated On : August 5, 2021 / 8:23 PM IST

Temple In Pakistan పాకిస్తాన్​లో హిందూ ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ పంజాబ్​ రాష్ట్రంలోని రహీమ్​ యార్​ ఖాన్​ జిల్లాలోని భోంగ్​ నగరంలో ఉన్న ఓ హిందూ ఆలయంపై బుధవారం అల్లరి మూక దాడి చేసింది. ఆలయంలోకి చొరబడి నిప్పు పెట్టి, విగ్రహాలను ధ్వంసం చేశారు. కాగా, కొద్ది రోజుల క్రితం తలెత్తిన వివాదం తీవ్రమై ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని..ఈ క్రమంలో ఆలయంపై దాడి జరిగినట్లు పోలీసు అధికారులు చెప్పారు.

స్థానిక పోలీసులతో పరిస్థితులు అదుపులోకి రాకపోవటం వల్ల..పరిస్థితిని అదుపు చేసేందుకు రేంజర్స్​ని రంగంలోకి దింపి ఆలయం చూట్టూ మోహరించినట్లు జిల్లా పోలీస్​ అధికారి రహీమ్​ యార్​ ఖాన్​ అసద్​ సర్ఫరాజ్ చెప్పారు. అల్లరి మూకలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న 100 హిందూ కుటుంబాలకు భద్రత కల్పించినట్లు తెలిపారు. అయితే ఆలయంపై దాడి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్​ చేయలేదని తెలిపారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించటం, మైనార్టీల భద్రత కల్పించటమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు.

కాగా,పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ చీఫ్ మరియు అధికార పీటీఐ పార్టీ ఎంపీ డాక్టర్​ రమేశ్​ కుమార్​ వంక్వానీ ఆలయంపై దాడి వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని రమేశ్ కుమార్ డిమాండ్ చేశారు. చీఫ్ జస్టిస్ దీనిపై చర్య తీసుకోవాలన్నారు.

మరోవైపు,ఆలయం కూల్చివేతపై నిరసన వ్యక్తం చేస్తూ భారత విదేశాంగ శాఖ.. పాకిస్తాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ లోని మైనార్టీల మత స్వేచ్ఛపై జరుగుతున్న వరుస దాడులు ఆందోళనకరమని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. అయితే,ఇటీవల కాలంలో పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున హిందూ ఆలయాలపై అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.