Turkiye Syria Earthquake: టర్కీ, సిరియాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. 8వేలు దాటిన మృతుల సంఖ్య
టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు, ఆర్థిక సహాయం అందించేందుకు పలుదేశాలు ముందుకొస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 70 దేశాల నుంచి వచ్చిన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

Turkiye Earthquake
Turkiye Syria Earthquake: టర్కీ, సిరియాలో భూకంపం దాటికి మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 7.7 తీవ్రతతో భారీ భూకంపం రావడంతో ఆ రెండు దేశాల్లోని వేలాది ఇల్లు నేలమట్టం అయ్యాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కుప్పకూలాయి. ఈ శిథిలాల కింద చిక్కుకొని వేలాది మంది ప్రాణాలు విడిచారు. ఇరు దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద నుంచి భారీ సంఖ్యలో మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీస్తున్నారు. బుధవారం ఉదయం నాటికి 8వేల మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Turkiye Earthquake
భారీ భూకంపానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు, ఆర్థిక సహాయం అందించేందుకు పలుదేశాలు ముందుకొస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 70 దేశాల నుంచి వచ్చిన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఫిబ్రవరి 6న తెల్లవారు జామున కహ్రామన్ మరాస్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం 435 సార్లు భూమి కంపించిందని టర్కీ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.

Turkiye Earthquake
టర్కీలో భూకంపం తరువాత 60,217 మంది సిబ్బందితోపాటు 4,746 వాహనాలు, నిర్మాణ సామాగ్రితో సహాయక చర్యలు చేపట్టినట్లు టర్కీ ప్రభుత్వం పేర్కొంది. టర్కీలో సహాయక చర్యల సమయంలో భూమి కంపిస్తుండటంతో భయాందోళన నెలకొంటుంది. పలుసార్లు సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుందని స్థానిక అధికారులు తెలిపారు.

Turkiye, Syria Earthquake
టర్కీ, సిరియాలకు భారత్ ఆపన్నహస్తం అందించింది. సహాయ సామాగ్రి, పరికరాలు, సైనిక సిబ్బందితో కూడిన నాలుగు సీ-17 విమానాలను భారతదేశం పంపించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, వారితో పాటు పరికరాలు, వాహనాలు, డాగ్ స్వ్కాడ్ లు, 100 మందికిపైగా సైనిక సిబ్బంది ఉన్నారు. వైద్య సిబ్బందిసైతం భారత్ నుంచి టర్కీ వెళ్లారు. టర్కీతో పాటు భారతదేశం సిరియాకు కూడా సీ130జే విమానం ద్వారా సహాయక సామాగ్రిని పంపించింది.

Turkiye, Syria Earthquake
సిరియాలో ఔషధాలు, పరికరాలకు తీవ్ర కొరత ఉంది. క్షతగాత్రులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో వైద్య పరికరాలను, ఔషధాలను భారత్ నుంచి సిరియాకు తరలించారు. ఇందులో మూడు ట్రక్కుల సాధారణ, రక్షణ పరికరాలు, అత్యవసర వినియోగ మందులు, సిరంజీలు, ఈసీజీ మెషీన్లు, మానిటర్ లు ఇతర అవసరమైన వైద్య సామాగ్రి, పరికరాలతో సహా ఆరు టన్నులకుపైగా సామాగ్రిని సిరియాకు భారత్ పంపించింది. ప్రస్తుతం రెండు దేశాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెంచే అవకాశం ఉన్నట్లు స్థానిక అధికారులు పేర్కొంటున్నారు.
Last night, an IAF C-17 got airborne for Türkiye. Bearing Search & Rescue teams of the @NDRFHQ, this aircraft is part of a larger relief effort that will be undertaken by the IAF along with other Indian organisations. #Türkiye#IAF_FirstResponders@IndianEmbassyTR pic.twitter.com/J8OsDd9ojn
— Indian Air Force (@IAF_MCC) February 7, 2023