Train Hijack: పాక్ రైలు హైజాక్ ఘటన.. వాళ్లను కాల్చేసి బిగ్గరగా నినాదాలు చేశారు.. భయంతో వణికిపోయాం..
పాకిస్థాన్ లో రైలు హైజాక్ ఘటన సంచలనం సృష్టించింది. బలోచిస్థాన్ ప్రావిన్సులోని పర్వతప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్ కు వెళ్తున్న ..

Pakistan Train Hijack
Pakistan Train Hijack: పాకిస్థాన్ లో రైలు హైజాక్ ఘటన సంచలనం సృష్టించింది. బలోచిస్థాన్ ప్రావిన్సులోని పర్వతప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్ కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో తొమ్మిది కోచ్ లలో మొత్తం 440 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఫ్రాంటియర్ కార్ప్స్, స్పెషల్ గ్రూప్ కమాండోస్ తో రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. తాజాగా.. ఆపరేషన్ విజయవంతం అయింది. తద్వారా రైలు హైజాక్ ఉదంతానికి తెర దించినట్లు పాకిస్థాన్ బుధవారం ప్రకటించింది.
పాకిస్థాన్ లో రైలు హైజాక్ అయిన ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులతోపాటు నలుగురు పారామిలిటరీ సైనికులు మృతిచెందినట్లు పాకిస్థాన్ ఆర్మీ జనరల్ పేర్కొన్నారు. పాకిస్థాన్ భద్రతా బలగాల కాల్పుల్లో 33 మంది మిలిటెంట్లు మృతిచెందారని ఆర్మీ అధికార ప్రతినిధి, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. రైలులో ఉన్న అందరు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయని, ఆపరేషన్ విజయవంతం అయిందని తెలిపారు.
పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ.. మార్చి 11న మధ్యాహ్నం 1గంట సమయంలో బలోచ్ మిలిటెంట్లు రైల్వే ట్రాక్ పేల్చేసి రైలును తమ నియంత్రణలోకి తీసుకున్నారు. వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. మంగళవారం సాయంత్రానికి 100 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడాం. మిగిలిన వారిని బుధవారం కాపాడాం. ఆత్మాహుతి బాంబర్లను మొదట స్పిపర్స్ చంపేశారు. అనంతరం ఒక్కో రైల్వే బోగీలోని టెర్రరిస్టులను హతమారుస్తూ వచ్చాం. ప్రస్తుతం ఘటన ప్రాంతంలో మిలిటెంట్లు ఎవరూ బతికిలేరు. అయితే, బాంబు నిర్వీర్య దళం రైలును చెక్ చేస్తోందని తెలిపారు.
మరోవైపు సురక్షితంగా బయటపడ్డ ప్రయాణీకులు తాము అనుభవించిన నరకాన్ని తలచుకుంటూ వణికిపోతున్నారు. వేర్పాటువాదుల చెరనుంచి బయటపడ్డాక వారంతా రాత్రిపూట వణికించే చలిలో నాలుగు గంటలపాటు నడిచి సమీపంలోని రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ.. బోగీల్లోకి చొరబడటంతోనే ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేశారు. పిల్లలు, మహిళలు, పౌరులను వేరు చేశారు. సైనికులందరినీ మరోవైపు తరలించారు. ఆ క్రమంలో ముగ్గురు సైనికులను మేము చూస్తుండగానే కాల్చేశారు. ఆ తరువాత వారు బిగ్గరగా నినాదాలు చేశారు. భారీ బాంబు పేలుళ్లు, కాల్పుల మోతలను జీవితంలో మర్చిపోలేము అంటూ చెప్పుకొచ్చారు.