ఈ వారంలోనే ప్రజల కోసం కరోనా వ్యాక్సిన్ విడుదల, రష్యా కీలక ప్రకటన

యావత్ ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ ను ప్రపంచంలో అందరికన్నా ముందుగా అభివృద్ధి చేసిన దేశంగా రష్యా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్పుత్నిక్-వి(Sputnik V V) పేరుతో రష్యా వ్యాక్సిన్ ను డెవలప్ చేసింది. అంతేకాదు సక్సెస్ ఫల్ గా ట్రాక్ కూడా చేసింది. ఈ క్రమంలో రష్యా మరో అడుగు ముందుకేసింది. వ్యాక్సిన్ గురించి కీలక ప్రకటన చేసింది. ప్రజల కోసం వ్యాక్సిన్ ను ఈ వారంలోనే విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
రష్యా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గమలేయ రిసెర్ట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ ఈ వ్యాక్సిన్ ను డెవలప్ చేసింది. ప్రజల వినియోగం కోసం ఓ బ్యాచ్ టీకాను విడుదల చేసేందుకు గమలేయ ఇన్ స్టిట్యూట్ కు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని రష్యా అకాడెమీ సైన్సెస్ అసోసియేట్ మెంబర్ డెనిస్ అన్నారు.
సెప్టెంబర్ 10 నుంచి 13 మధ్య విడుదల:
కొన్ని రోజుల్లో టీకా పరీక్ష ప్రారంభం కానుంది. అలాగే కొద్ది రోజుల్లో అనుమతి కూడా లభించనుంది. ఓ ప్రోసీజర్ ప్రకారం ప్రజల వినియోగం కోసం ఒక బ్యాచ్ టీకా విడుదల చేయాల్సి ఉంది. కచ్చితంగా ఆ టీకా నాణ్యత కలిగి ఉండాలి. కేవలం కొన్ని రోజుల్లోనే సెప్టెంబర్ 10 నుంచి 13 మధ్య, ప్రజల వినియోగం కోసం ఓ బ్యాచ్ టీకాను విడుదల చేసేందుకు మేము అనుమతి పొందుతామనే నమ్మకం ఉంది. అప్పటి నుంచి జనాలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభం అవుతుంది అని డెనిస్ తెలిపారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని తెలిపారు.
అలాగే, పోస్ట్ రిజిస్ట్రేషన్ ట్రయల్స్ కోసం మూడు మాస్కో ఔట్ పేషెంట్ క్లినిక్ లకు ఇప్పటికే తొలి బ్యాచ్ కరోనా వ్యాక్సిన్ అందిందని డిప్యూటీ మాస్కో మేయర్ రకోవా తెలిపారు. మాస్కోలో నివాసం ఉంటున్న ప్రజలు అధ్యయనంలో పాల్గొనేందుకు, తొలుతగా వ్యాక్సిన్ పొందేందుకు తమ పేర్లు దరఖాస్తు చేసుకోవచ్చని మేయర్ చెప్పారు.
రష్యా వ్యాక్సిన్ సురక్షితమే:
పోస్ట్ రిజిస్ట్రేషన్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగానే అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. సుమారు 40వేల మంది ప్రజలు ఈ అధ్యయనంలో పాల్గొంటారని అంచనా వేశారు. ఇప్పటికే తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను అనుమతి లభించినట్టు గత నెలలో రష్యా ప్రకటన చేసింది. కాగా, ఇంకా క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాలేదని రష్యా ఆరోగ్య శాఖ చెప్పింది. తమ తొలి దశ ప్రయోగాల్లో వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలిందని, మెరుగైన ఫలితాలు చూపిందని ఇటీవలే పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో స్పుత్నిక్-వి తొలి, రెండో దశ ప్రయోగాల ఫలితాలను పరిశోధకులు శుక్రవారం(సెప్టెంబర్ 4,2020) ప్రచురించారు.
యాంటీబాడీల ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంది:
లాన్సెట్ జర్నల్ రష్యా వ్యాక్సిన్ విషయంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 76 మందిపై వ్యాక్సిన్ ప్రయోగం చేసినట్టు తెలిపింది. వాళ్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కన్పించలేదని వెల్లడించింది. 42 రోజుల పాటు క్లినికల్ ట్రయల్స్ తర్వాత ఈ విషయాలు బయటపడ్డాయని తెలిపింది. 21 రోజుల్లోనే వాలంటీర్లలో యాంటీబాడీస్ తయారైనట్టు లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. ప్రయోగాల్లో రెండు రకాల డోసులను వాడారు. ఒకటి ఆర్‌ఏడీ26-ఎస్ కాగా రెండోది ఆర్‌ఏడీ5-ఎస్. ఈ రెండింటిని 18-60 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతులపై ప్రయోగించారు. తొలి దశ ప్రయోగాల్లో పాల్గొన్న వాలంటీర్లకు రెండో డోసుల్లో ఏదో ఒకదాన్ని మాత్రమే ఇచ్చారు. రెండో దశలో మాత్రం రెండింటినీ కలిపి ఇచ్చారు. ఈ ఫలితాలు చాలా ఉత్సాహకరంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. యాంటీబాడీల ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉందని.. టీ కణాల ప్రతిస్పందన కూడా వేగంగా ఉందని చెప్పారు.
21 రోజుల్లోనే యాంటీబాడీలు ఉత్పత్తి:
వ్యాక్సిన్ వేసుకున్నవారిలో 21 రోజుల్లోనే యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయని.. రోగ నిరోధకశక్తి పెంచడంలో కీలక పాత్ర పోషించే టీ కణాల ప్రతిస్పందన కూడా 28 రోజుల్లోనే కనిపించిందని తెలిపారు. మొత్తం 76 మందిపై ప్రయోగాలు నిర్వహించి, 42 రోజుల పాటు వారిని పరిశీలించామని, ఎవరిలోనూ దుష్ప్రభావాలు కనిపించలేదని వివరించారు. కరోనా వ్యాక్సిన్ పారిశ్రామిక ఉత్పత్తిని సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తామని ఇదివరకు రష్యా అనౌన్స్ చేసింది. రష్యా టాప్ లీడర్లు, రక్షణ శాఖ మంత్రి సెర్గీ సహా పలువురు నేతలు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
రష్యా వ్యాక్సిన్ పూర్తిగా సేఫ్:
ప్రాణాంతక కరోనా వైరస్‌కు ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌ను స్పుత్నిక్-వి పేరుతో రష్యా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండానే, టీకాను ఆమోదించి, విడుదల చేయడంపై నిపుణులు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం? అనే చర్చ జరుగుతోంది. ఈ సందేహాలకు చెక్ పెడుతూ రష్యాకు ఊరట కలిగించేలా పరిశోధకులు ఓ శుభవార్త చెప్పారు.
ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో స్పుత్నిక్-వి తొలి, రెండో దశ ప్రయోగాల ఫలితాలను పరిశోధకులు ఇటీవల ప్రచురించారు. తమ ప్రయోగాల్లో వాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలిందని పరిశోధకులు వెల్లడించారు. టీకా ప్రయోగించిన వాళ్లలో కరోనాను ఎదుర్కోనే యాంటీ బాడీస్ తయారైనట్టు తెలిపారు. అయితే కీలకమైన ఫేజ్-3 వివరాలు ఇంకా ప్రకటించలేదని, తొందరపడి రష్యా వ్యాక్సిన్‌పై తుది నిర్ణయానికి ఇప్పుడే రావొద్దని నిపుణులు చెబుతున్నారు.