వావ్ సూపర్.. ప్లాస్టిక్, వాటర్ మిక్స్ చేసి పెట్రోల్ తయారీ.. ఇలా చేశారు..
సౌత్ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ప్లాస్టిక్, నీటిని కలిపి పెట్రోల్ తయారు చేశారు.

Petrol with plastic
Petrol with plastic: భూమిపై, నదులు, సముద్రాల్లో కాలుష్య కాసారాలుగా మారుస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టడం పెను సవాల్ గా మారుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అందరి జీవితాల్లో ప్లాస్టిక్ వినియోగం అనేది కామన్ అయింది. అయితే, ప్లాస్టిక్ వినియోగం వల్ల ఏర్పడే అనర్ధాలను గుర్తించి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లు వాడకంపై నిషేధం విధించారు. అయితే, మనిషి అడుగు పెట్టిన చోట.. అడుగు పెట్టని చోట ఇలా ఎక్కడపడితే అక్కడ టన్నులకొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. ఆ ప్లాస్టిక్ ను సేకరించడం పెద్ద తలనొప్పి.. ఒకవేళ కిందామీదా పడి సేకరించినా ఏం చేయాలన్నది పెద్ద ప్రశ్న. కొందరు టెయిల్స్ లేదా రోడ్లు వేయవచ్చునని సూచిస్తున్నారు. దీని వల్ల ప్లాస్టిక్ కన్వర్షన్ అయ్యేది చాలా తక్కువే. కానీ, ప్లాస్టిక్ నుంచి మన వాహనాలకు అవసరమైన ఇంధనం తయారు చేసుకోవటం ఇటీవల కాలంలో తరచుగా చూస్తున్నాం. అయితే, సౌత్ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఈ దిశగా ప్రయోగాలు చేసి విజయవంతం అయ్యారు.
ప్లాస్టిక్ తో నీళ్లను కలిపి..
ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చివేయడం ద్వారా వాతావరణంలో పొల్యూషన్ సమస్య ఏర్పడుతుంది. దీంతో ప్లాస్టిక్ వ్యర్ధాలను కరిగించి కాలుష్యరహితమైన వస్తువులను తయారు చేయాలనే ఉద్దేశంతో అనేక దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే, ప్లాస్టిక్ వ్యర్థాలను కరిగించి రోడ్లేసేలా ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా.. సౌత్ కొరియా పరిశోధకులు ప్లాస్టిక్ వ్యర్థాలతో నీళ్లను కలిపి పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు తయారు చేస్తున్నారు. దాదాపు 97శాతం వరకు ప్లాస్టిక్, నీళ్లను కలిపి ఇంధనం తయారు చేశారు.
ఎలా తయారు చేశారంటే..
ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ లో పాలీఓలిఫిన్ అనే రకం ప్లాస్టిక్ వాడకమే ఎక్కువగా ఉంటంది. ఆ ప్లాస్టిక్ వేస్ట్ ను నీళ్లతో కలిపి రుథీనియం జియోలైట్ వై అనే కేటలిస్టులతో రియాక్ట్ అయ్యేలా చేశారు. కేటలిస్ట్ రియాక్షన్ తో ఆ మిశ్రమంలోని నీళ్లు ప్లాస్టిక్ ను పెట్రోల్, గ్యాసోలిన్, డీజిల్ గా మార్చేలా చేశారు. ప్లాస్టిక్, రుథీనియం మిశ్రమంలో నీటిని కలపడం తో కార్బన్ ఎఫిషియెన్సీ పెరిగిందని పరిశోధకులు గుర్తించారు. నీటితో ఆ మిశ్రమంలో చైన్ రియాక్షన్ మెకానిజమ్స్ మారిపోయాయని కనుగొన్నారు. అంతేకాక.. నీటిని యాడ్ చేయడంతో బొగ్గు ఎక్కువగా రాకుండా కేటలిస్టుల పనితీరు మరింత మెరుగుపడిందని తేల్చారు. ఆర్థికపరంగా కూడా ఇదిలా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని పరిశోధనలకు అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుంటున్న నెటిజన్లు.. ఇలాంటి ఇంధనం త్వరగా అందుబాటులోకి వస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు.