Balochistan Army : రెండు దేశాలకు వణుకు పుట్టిస్తున్న బెలూచిస్థాన్‌ ఆర్మీ

బలూచ్‌ తిరుగుబాటును పాకిస్థాన్‌ అణిచివేసే ప్రయత్నాలు చేస్తుండడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయ్.

Balochistan Army : రెండు దేశాలకు వణుకు పుట్టిస్తున్న బెలూచిస్థాన్‌ ఆర్మీ

Updated On : March 13, 2025 / 4:22 PM IST

బలూచిస్థాన్‌ ఆర్మీ.. చైనా, పాక్ దేశాలకు నిద్రలేకుండా చేస్తున్న పేరు ఇది. చంపడం, చావడం మాత్రమే తెలిసిన సైన్యం ఇది. హక్కుల కోసం అంటూ యుద్ధం మొదలుపెట్టిన బలూచ్ ఆర్మీ.. రక్తపాతం సృష్టిస్తోంది. పాక్‌లో రైలును హైజాక్ చేసి వంద మందికిపైగా ప్రయాణికులను బందీలుగా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఎవరీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్లు. ఎందుకు రైలును హైజాక్ చేశారు. అసలు వాళ్ల డిమాండ్లు ఏంటి. పాక్ ప్రభుత్వంతో దశాబ్దాలుగా ఎందుకు పోరాటం చేస్తున్నారు.. చైనా పేరు చెప్తే ఎందుకు కోపంతో ఊగిపోతున్నారు..

చేసిన పాపాలు.. పాకిస్తాన్‌ను వెంటాడుతున్నాయ్. బలం ఉంది కదా అని అడ్డగోలు వేషాలు వేస్తే.. మొదలయ్యే తిరుగుబాటు ఎంతటి తలపోటే అర్థం అవుతోంది. బలూచ్‌ ఆర్మీనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌. పాక్‌లో ప్రస్తుతం అంతర్యుద్ధం తీవ్రంగా మారింది. బలూచిస్తాన్‌కు స్వాతంత్ర్యం కోసం.. బలోచ్ లిబరేషన్ ఆర్మీలాంటి వేర్పాటువాద సంస్థలు.. దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయ్. పాక్ ప్రభుత్వంపై, సైన్యంతో ఎప్పటికప్పుడూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తూ.. ఉనికిని చాటుతూనే ఉంది. ఐతే ఇప్పుడు రైలు హైజాక్ ఘటనతో.. ప్రపంచం అంతా అవాక్కయింది.4వందల మందితో క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై దాడి చేసిన బీఎల్ఏ ఫైటర్లు.. 100 మందికిపైగా ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. రైలు హైజాక్ ఘటన పాక్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. తమపై పాక్ ప్రభుత్వం గానీ.. ఆర్మీ గానీ చర్యకు దిగితే.. బందీలను చంపేస్తామని బలూచ్‌ లిబరేషన్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది.

వీళ్ల లక్ష్యం ఏంటి..

పాక్‌తో పాటు చైనాకు కూడా చుక్కలు చూపిస్తోంది బలూచ్ ఆర్మీ. ట్రైన్ హైజాక్ ఘటనతో.. బలూచ్ ఆర్మీ వ్యవహారంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఏంటీ ఆర్మీ.. వీళ్ల లక్ష్యం ఏంటి.. ఇంతటి మారణహోమం ఎందుకు క్రియేట్ చేస్తున్నారు.. అసలు చైనాతో సంబంధించి ఏంటి.. అసలు వీళ్ల డిమాండ్లు ఏంటనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయ్. 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం లభించాక.. పాకిస్థాన్‌ వేరుగా విడిపోయింది. అప్పుడు పాకిస్థాన్‌లో బలోచిస్థాన్‌ స్వతంత్ర్య రాజ్యంగా ఉండేది. 1948లో బలూచిస్థాన్‌ను పాకిస్థాన్‌ బలవంతంగా స్వాధీనం చేసుకుంది. దీంతో అప్పటినుంచి బలూచిస్తాన్ జనాలు.. తమ రాజకీయ, సాంస్కృతిక గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నారు. 1970లో బలూచ్ జనాలు.. పాక్‌ నుంచి విడిపోయేందుకు చాలాసార్లు యత్నించారు. పాకిస్థాన్ సైనిక చర్య ప్రారంభించి బలూచ్‌ జనాల పోరాటాన్ని అణిచివేసింది. దీంతో పలు గ్రూపులు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నాయ్‌. అలా ఏర్పడిందే బలూచ్‌ లిబరేషన్ ఆర్మీ.

మజీద్‌ బ్రిగేడ్‌ పేరుతో సూసైడల్ స్క్వాడ్..

నిజానికి దేశ విభజన సమయంలో.. బలూచిస్తాన్‌లోని అతిపెద్ద రాచరిక రాష్ట్రమైన ఖాన్ ఆఫ్ కలాత్.. భారత్‌లో చేరాలని కోరుకుంది. ఐతే జిన్నా ఒత్తిడి తీసుకువచ్చారని.. కలాత్, మక్రాన్‌తోపాటు బలూచిస్తాన్‌లోని లస్‌బేలా, ఖరన్ పాక్‌లో బలవంతంగా చేర్చుకున్నారన్నది అక్కడి జనాల ఆరోపణ. నిజానికి ఇప్పటి రక్తపాతానికి 75ఏళ్ల కిందే బీజం పడింది. పాకిస్తాన్‌లో బలూచ్‌ చేరిన వెంటనే తిరుగుబాటు ప్రారంభమైంది. 1948, 1958-59, 1962-63, 1973-77 మధ్య తిరుగుబాట్లు జరిగాయ్‌. ఐతే 1973లో అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికల్ అలీ భుట్టో.. బలూచిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వాన్ని రద్దు చేసి, సైనిక చర్యకు ఆదేశించాడు. బలూచ్ ఆర్మీ పోరాటం చేస్తోంది.. స్వాతంత్ర్యం కోసం ! బలూచిస్థాన్ అనేది.. నైరుతి పాకిస్థాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ అఫ్గానిస్థాన్‌లో వ్యాపించి ఉంది. ఐతే పాకిస్థాన్ నుంచి విడిపోయి బలూచిస్థాన్‌ ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడాలని.. తమకు స్వయం నిర్ణయాధికారం ఉండాలని BLA డిమాండ్ చేస్తోంది. 2వేల సంవత్సరంలో ఏర్పాటయిన బలూచిస్తాన్ ఆర్మీని.. పాకిస్తాన్‌, అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయ్‌. 2011 నుంచి బలూచ్ ఆర్మీ యాక్టివ్ అయింది. మజీద్‌ బ్రిగేడ్‌ పేరుతో సూసైడల్ స్క్వాడ్ క్రియేట్‌ చేసి పాక్‌ వెన్నులో వణుకు పుట్టిస్తోందీ ఆర్మీ.

పాకిస్తాన్ విస్తీర్ణంలో బలూచిస్తాన్ 44శాతం..

విస్తీర్ణంపరంగా పెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్‌.. అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రంగా మిగిలి పోయింది. మొత్తం పాకిస్తాన్ విస్తీర్ణంలో బలూచిస్తాన్ విస్తీర్ణం 44శాతం ఉంటుంది. బలూచిస్తాన్‌లో చమురు, ఖనిజ సంపదను పాక్ సర్కార్‌ అక్రమంగా దోచుకుంటోందని BLA ఆరోపిస్తోంది. బలూచ్ జనాలు జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని బలూచ్ ఆర్మీ ఆరోపిస్తోంది. ఇక అటు పాక్‌కు తోడు చైనా కూడా రంగంలోకి దిగడంతో.. BLA మరింత కోపంతో రగిలిపోతోంది. పాక్‌కు వ్యూహాత్మక మిత్రదేశంగా ఉన్న చైనా.. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోనే సీపెక్‌.. అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తోంది. దీంతో బలూచ్‌ ఆర్మీ మరింత దూకుడు పెంచింది. చైనా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, చైనా ఇంజినీర్ల మీద చాలాసార్లు దాడులు చేసింది. పాకిస్తాన్ సైనిక జనరల్స్, ప్రభుత్వంలోని ఉన్నతవర్గాలు.. వారి విలాసాల కోసం బలూచిస్తాన్‌లోని సహజ వనరులను దోచుకుంటున్నారని.. అవి తమ దేశానివేనని ట్రైన్‌ హైజాక్‌ ఘటన తర్వాత.. BLA ప్రకటించింది. విదేశీ పెట్టుబడిదారులు.. బలూచిస్తాన్ వనరుల దోపిడీలో పాల్గొనవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

2011 నుంచి 10వేల మందికి పైగా జనాలు మాయం..

బలూచ్‌ తిరుగుబాటును పాకిస్థాన్‌ అణిచివేసే ప్రయత్నాలు చేస్తుండడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయ్. బలూచ్‌ పౌరులను కిడ్నాప్ చేసి మళ్లీ వారి జాడ లేకుండా.. స్థానిక ప్రభుత్వ నిఘా సంస్థలు చేస్తున్న కుట్రలు చేస్తున్నాయనే నివేదికలు బయటకు వచ్చాయ్‌. 2011 నుంచి దాదాపు 10వేల మందికి పైగా జనాలు కనిపించకుండా పోయారు. ఇలాంటి పరిణామాల మధ్య.. బలూచ్‌ ఆర్మీ మరింత దూకుడు చూపిస్తోంది. చైనా ప్రాజెక్ట్‌లపై బలూచ్ ఆర్మీ మరింత రగిలిపోతోంది. ఆ మధ్య పాక్, చైనా మధ్య స్నేహానికి బీటలు పారినట్లు కనిపించింది. బలూచ్ ఆర్మీని కంట్రోల్ చేయకపోతే.. పెట్టబడులు వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉందన్నట్లు చైనా పరోక్షంగా సంకేతాలు పంపించింది అంటే.. BLA ఏ రేంజ్‌లో దెబ్బతీస్తుందో అర్థం చేసుకోవచ్చు.

బలూచిస్తాన్ అంటే బంగారు బాతు…

బలూచిస్తాన్‌ అనేక వనరులకు నిలయం. లిథియం, గ్యాస్, చమురు, రాగి, బంగారు నిక్షేపాలు ఉన్నాయ్‌. వీటిని సొంతం చేసుకునేందుకు పాక్ ప్రభుత్వంతో పాటు చైనా ప్రయత్నిస్తోంది. దీనికోసం అక్కడి జనాల హక్కులను పట్టించుకోవడం లేదు. ఇక బలూచిస్తాన్‌లో గ్వాదర్ పోర్టుని చైనానే నిర్మిస్తోంది. జిన్‌జియాంగ్ ప్రావిన్సుని, గ్వాదర్ పోర్టుని కలుపుతూ రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది చైనా. తమ వనరులని చైనా కొల్లగొడుతుందనే భావన బలూచ్ జనాల్లో మొదలైంది. దీంతో వారు డ్రాగన్‌ కంట్రీపై వరుస దాడులు చేస్తున్నారు. ప్రాజెక్ట్ మీద.. ప్రాజెక్టులో పనిచేసే అధికారుల మీద వరుస దాడులకు దిగుతోంది అందుకే ! ప్రపంచంతో వాణిజ్య సంబంధాల కోసం.. మలక్కా జల సంధిపై చైనా ఆధారపడుతోంది. ఐత ఎప్పుడైనా ఉద్రిక్తతలు పెరిగితే.. ఈ మార్గంలో చైనా నౌకల్ని దిగ్బంధించే అవకాశం భారత్‌కు ఉంటుంది. దీన్ని అడ్డుకోవడానికి గ్వాదర్ పోర్టుని నిర్మిస్తోంది చైనా.

20వేల మందికి పైగా నిర్బంధించారని ఆరోపణలు..

బలూచిస్తాన్‌కు బంగారు బాతులాంటి గ్వాదర్‌ డీప్‌ సీ పోర్టును కూడా.. చైనా చేతిలో పెట్టడం తిరుగుబాటును తీవ్రం చేసింది. హత్యలే కాకుండా.. కొన్ని పోలీస్‌ స్టేషన్‌లను కూడా బలూచ్‌ ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయ్‌. జాతీయ రహదారులను దిగ్బంధనం చేశాయ్‌. రైల్వేలైన్లను పేల్చి వేశాయ్‌. తమ వనరులను పాకిస్తాన్ పంజాబ్‌ ప్రావిన్స్‌ దోచుకుంటోందని.. తమకు న్యాయం జరగడం లేదని బలూచిస్తాన్‌ జనాల వాదన. దీనికి తోడు పాక్ ఆర్మీ దారుణాలకు లెక్కే లేదు. ఈ ప్రావిన్స్‌లో 20వేల మందికి పైగా పురుషులు, మహిళలు, పిల్లలను చట్టవిరుద్ధంగా నిర్బంధించారని సైన్యంపై ఆరోపణలు ఉన్నాయ్‌. మహిళలపై అత్యాచారం చేసి చంపేవారు. ప్రభుత్వానికి ఎదురుతిరిగిన వారిని కిడ్నాప్ చేసి చంపేసేవాళ్లు. గోర్లు పీకేసిన, తలలో రంధ్రాలు ఉన్న డెడ్‌బాడీలు దొరికాయంటే.. బలూచిస్తాన్‌లో పాక్ ప్రభుత్వం ఏ స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

బెలూచీలు, పష్తూన్‌ జనాల మధ్య విభేదాలు..

బలూచిస్తాన్‌పై పట్టు నిలుపుకునేందుకు.. పాక్ సర్కార్ చేయని దగుల్బాజీ పని లేదు. అక్కడ ఉంటే బెలూచీలు, పష్తూన్‌ జనాల మధ్య విభేదాలు రాజేస్తూ.. BLA దూకుడుకు అడ్డు కట్ట వేసే ప్రయత్నం చేసినా.. ఏదీ సక్సెస్ కాలేదు. తమ దేశం.. తమ హక్కులు అనే నినాదందో.. బలూచ్ ఆర్మీ దాడులు ముమ్మరం చేసింది. మోడ్రన్‌ వార్‌ఫేర్‌లోనూ వాళ్లు ప్రావీణ్యం సాధించినట్లు కనిపిస్తోంది. దీంతో పాక్ సర్కార్, ఆర్మీ చుక్కలు చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ చేజారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయ్. నిజానికి ప్రస్తుతం బలూచిస్తాన్‌లోని.. క్వెట్టా, తర్బుత్‌లాంటి కొన్ని ప్రాంతాల్లోనే పాక్ ప్రభుత్వ ఆధిపత్యం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తిరుగుబాటుదారులదే పైచేయిగా ఉంది. ఓ వైపు బలూచ్ ఆర్మీ చుక్కలు చూపిస్తుంటే.. పశ్చిమ ప్రాంతంలోనే తెహ్రీక్‌ ఎ తాలిబన్‌ పాకిస్తాన్‌ సంస్థ కూడా.. పాక్‌ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది.

మూడు ముక్కలు కానున్న పాక్‌..

పాకిస్తాన్ జాతిపితగా పిలిచే మహ్మద్ అలీ జిన్నా… బలూచిస్తాన్‌కి చేసిన నమ్మక ద్రోహంతో ఆ ప్రాంతం కొన్ని దశాబ్దాలుగా రగులుతూనే ఉంది. పాక్ నుంచి విముక్తి, తమ వనరులపై హక్కుల కోసం బలూచ్ జనాలు తిరుగుబాట్లు చేస్తూనే ఉన్నారు. అయినా సైన్యం సాయంతో.. కుట్రలు చేస్తూ పాక్ ప్రభుత్వం ఈ తిరుగుబాటుని అణచివేస్తూనే ఉంది. ఐతే ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. పాక్ రైల్వేకి చెందిన రైలును హైజాక్ చేయడం సంచలనంగా మారింది. ఓ వైపు బలూచ్ ఆర్మీ దాడులు.. మరోవైపు ఖైబర్ పంక్తుక్వాలో తెహ్రీక్ ఏ తాలిబన్‌ సంస్థ దూకుడు.. మరోవైపు వెంటాడుతున్న ఆర్థిక కష్టాలు.. ఇలాంటి పరిణామాల మధ్య పాకిస్తాన్ మూడు ముక్కలు కావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.