Sri Lanka : కష్టాలు.. కన్నీళ్లు. భరించలేని ఆకలి.. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం
శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అక్కడి ప్రజల్లోనూ ఆంధకారంలో పడేశాయి. ఆ దేశ స్వతంత్ర్య చరిత్రలోనే తొలిసారిగా తీవ్ర సంక్షోభంలో ప్రజలు ఆకలితో...

Srilanka
Sri Lanka Economic Crisis : కష్టాలు.. కన్నీళ్లు.. భరించలేని ఆకలి.. కమ్ముకున్న కారు చికట్లు.. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం..! ఇది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలోని ప్రస్తుత పరిస్థితి..! శ్రీలంకలో ప్రభుత్వ రావణకాష్టం.. లంకా దహనానికి కారణమయింది. ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో అల్లాడిపోతున్న ప్రజల్లో ఆగ్రహం ఉగ్రరూపం దాల్చింది. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడి నివాసం మీదకే దండెత్తేలా చేసింది. పోలీసు వాహనాలకు నిప్పుపెట్టేలా చేసింది. ప్రభుత్వ బస్సులను తగలబెట్టేలా చేసింది. పోలీసులసై రాళ్లురువ్వేలా చేసింది. ఎంత కడుపు కాలి ఉంటే ప్రజలు ఇలా రోడెక్కి ఉద్యోమిస్తారో..! నిరసనల్లో తమతో పాటు చిన్నారులను కూడా కొంత మంది తీసుకొచ్చారు. ఆందోళనలో మహిళలూ పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దేశ భక్తి అంటే రాజకీయనాయకులను గుడ్డిగా నమ్మడం కాదని.. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు గొంతెత్తడమంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అధ్యక్షుడు తక్షణం పదవి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Read More : Srilanka – India: శ్రీలంక ఆర్ధిక మంత్రిని కలిసిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్
శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అక్కడి ప్రజల్లోనూ ఆంధకారంలో పడేశాయి. ఆ దేశ స్వతంత్ర్య చరిత్రలోనే తొలిసారిగా తీవ్ర సంక్షోభంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యవసర వస్తువులు కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆహారం, చమురు, విద్యుత్ సంక్షోభంతో శ్రీలంక కుదేలవుతోంది. దీంతో వేలాది మంది ప్రజలు వేరే ప్రాంతాలకు వలసబాటపడుతున్నారు. నిరంతర విద్యుత్ కోతలు, పెరుగుతున్న నిత్యవసర ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. విద్యుత్ కొరతతో రాత్రి వేళ స్ట్రీట్ లైట్లను కూడా ఆన్ చేయని పరిస్థితి నెలకొంది. ఇంధన కొరతతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే.. తినడానికి తిండి లేదు.. వంట చేసుకోవడానికి గ్యాస్ లేదు. ఇంట్లో ఉందామన్న కరెంట్ లేదు. బంగారమే కాదు.. పాలపౌడర్ ధర కూడా కొండెక్కి కూర్చుంది.
Read More : Srilanka : భారత్ తీరాన్ని తాకిన లంక సంక్షోభం
ఉప్పు కోసం కూడా గంటల కొద్దీ క్యూలో నించోవాల్సి వస్తుంది. అలా గంటల తరబడి వేచి ఉన్నా సరుకులు దొరుకుతాయనే గ్యారంటీ లేదు. శ్రీలంక ప్రభుత్వం చేసిన అప్పులే ఈ పరిస్థితికి కారణం. దీంతో వీటన్నిటిని ఇంతకాలం ఓపిగ్గా భరించిన ప్రజలు ప్రభుత్వంపై తాడోపెడో తేల్చుకునేందుకు నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమంటూ.. ఏకంగా అధ్యక్షుడి భవనాన్నే ముట్టడించారు. కొలంబోలోని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. రాజపక్సే రాజీనామా చేయాలంటూ వందలాది మంది లంకేయులు గళమెత్తారు. ఈ నిరసన కాస్త హింసాత్మకంగా మారడంతో పదుల సంఖ్యలో ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో జర్నలిస్టులు కూడా ఉన్నారు.
Read More : Srilanka Economic Crisis : గుడ్డు 35 రూపాయలు… పెట్రోల్ రూ.283….శ్రీలంక సంక్షోభం
గోటబయ రాజపక్సే ఇంటి వద్దకు చేరుకోని నినాదాలు చేస్తుండగా.. పోలీసులు మొదట వారిని అడ్డుకున్నారు. రాజపక్సే ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నిరసనకారులపై భద్రతా బలగాలు రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపాయి. నిరసనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్, వాటర్ కెనన్లు ప్రయోగించాయి. ఆ తర్వాత పరిస్థితులు మరింత ఉదృతంగా మారిపోయాయి. ఓ ఆర్మీ బస్సుకు.. పోలీసు వాహనానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. దీంతోపాటు భద్రతా దళాలపై రాళ్లు కూడా రువ్వారు. నిరసన సమయంలో రాజపక్సే ఇంట్లో లేరని సమాచారం. ఈ హింసాకాండతో రాజధానిలో కర్ఫ్యూను విధించారు అధికారులు. రాజపక్సే ఇంటి చుట్టూ భద్రతను ఏర్పాటు చేశారు. నగరం అంతటా భద్రతా బలగాలను మోహరించారు.
Read More : Srilanka Inflation: శ్రీలంకలో తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం: ఆకాశంలో పాలు, చికెన్, ఆయిల్ ధరలు
శ్రీలంకలో పరిస్థితిలో మార్పులేని పక్షంలో ఆ దేశంనుంచి వేలాదిమంది భారత తీరాలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. శ్రీలంకలో ఆదాయం లేకపోగా… నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో శ్రీలంకలోని పౌరులు భారత్‌లోకి ప్రవేశించడానికి దారులు వెతుక్కుంటున్నారు. కరోనాతో కుదేలైన ఆ దేశ ఆర్థిక పరిస్థితి – రష్యా యుక్రెయిన్ యుద్ధంతో మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. ద్రవ్యోల్బణం రికార్డ్ స్థాయికి చేరుకుని చరిత్రలో ఎన్నడూలేని విధంగా ధరలు చుక్కలను అంటాయి. పెట్రో ఉత్పత్తులనుంచి నిత్యావసర వస్తువుల వరకు దారుణంగా ధరలు పెరిగిపోయి సాధారణ ప్రజలు బతికే పరిస్థితులు లేకుండాపోయాయి. గత కొన్ని రోజుల క్రితం లీటర్ పెట్రోలు 283 రూపాయలకు, లీటర్ డీజిల్ 220 రూపాయలకు అమ్ముతున్నారు. చికెన్ 800 నుంచి 1000 రూపాయలు పలుకుతుండగా కోడిగుడ్డు ధర 35 రూపాయలు చేరుకుంది. కేజీ ఉల్లిపాయలు 200 నుంచి 250 రూపాయలుగా ఉంది. వంట గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మూతపడ్డాయి. రెస్టారెంట్లలో ఓ కప్పు పాలకు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.