Tide Detergent In Space : అవాక్కయ్యారా.. అంతరిక్షంలో వ్యోమగాములు బట్టలు ఉతుక్కోవచ్చు!
అంతరిక్షంలోనూ బట్టలు తెల్లగా మెరిసిపోనున్నాయి.. అవాక్కయ్యారా..! అవును మీరు విన్నది నిజమే.. అంతరిక్షంలో వ్యోమగాముల బట్టలపై మురికి వదిలిస్తానంటోంది ప్రోక్టర్ అండ్ గాంబుల్(P&G) సంస్థ...

Tide To Make World's First Space Detergent
Tide Detergent In Space : అంతరిక్షంలోనూ బట్టలు తెల్లగా మెరిసిపోనున్నాయి.. అవాక్కయ్యారా..! అవును మీరు విన్నది నిజమే.. అంతరిక్షంలో వ్యోమగాముల బట్టలపై మురికి వదిలిస్తానంటోంది ప్రోక్టర్ అండ్ గాంబుల్(P&G) సంస్థ… మన గ్రహంపైనే కాదు.. అంతరిక్షంలోనూ వ్యోమగాములు బట్టలు ఉతకడానికి తమ బ్రాండ్ Tide డిటర్జెంట్ తయారుచేస్తామంటోంది. దాంతో ప్రపంచంలోని మొట్టమొదటి అంతరిక్ష డిటర్జెంట్ టైడ్ కానుంది. అంతేకాదు.. ఈ సంస్థ వాషింగ్ మెషీన్‌లో కూడా తయారుచేయాలని భావిస్తోంది. సాధారణంగా అంతరిక్షంలో వ్యోమగాములు ధరించే దుస్తులను ఉతకడానికి వీలుండదు.
బాగా మురికి పట్టేంతవరకు అలానే ధరిస్తారు. ఆ తర్వాత కొత్తవి వేసుకొని విడిచిన దుస్తులను ఒకచోట ఉంచుతారు. తద్వారా వ్యోమగాముల కోసం ఎక్కువ సంఖ్యలో దుస్తులు తయారుచేయాల్సి వస్తోంది. ఈ సమస్యకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA) పరిష్కారాన్ని అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే P&G సంస్థతో నాసా జతకట్టింది. అంతరిక్షంలో వ్యోమగాముల మురికిపట్టిన దుస్తులను శుభ్రపరచడంపై పరిశోధన చేయనుంది.
స్పేస్ స్టేషన్‌లో వ్యోమగాములు ప్రతిరోజూ రెండు గంటలు వ్యాయామం చేస్తారు. వ్యోమగాములకు చెమట పట్టకుండా.. బ్యాక్టీరియా సోకకుండా యాంటిబ్యాక్టీరియల్ దుస్తులను నాసా తయారు చేసింది. మురికి పట్టిన దుస్తులను విషపూరితమైనవిగా భావిస్తారు వ్యోమగాములు.. వ్యోమగాములకు ఏడాదికి మొత్తం 68 కిలోల బట్టలు అవసరం పడుతుంది. కార్గో షిప్స్ చాలా ఖరీదైనవి.. అందుకే నాసా బట్టలు రవాణా అవసరం రాని మార్గాలను అన్వేషిస్తుంది. అంగారక గ్రహానికి మూడేళ్ల మిషన్‌కు అవసరమైన బట్టలు తీసుకెళ్లాలంటే కష్టమే.. అందుకే ధరించిన దుస్తులను తిరిగి వినియోగించే దిశగా నాసా ఈ పరిశోధన చేస్తోంది.
ఒక టైడ్ డిటర్జెంట్.. ఒక స్టెయిన్ రిమూవల్‌ను ఈ ఏడాది డిసెంబర్ నెలలో ప్రయోగాత్మకంగా అంతరిక్షానికి పంపించనున్నట్లు P&G సంస్థ వెల్లడించింది. అంతరిక్షంలో.. గురుత్వాకర్షణ లేని చోట డిటర్జెంట్లో ఉండే పదార్థాలు ఏ విధంగా పనిచేస్తాయో నాసా సైంటిస్టులు రీసెర్చ్ చేయనున్నారు. అనంతరం స్టెయిన్ రిమూవల్ పెన్నులను కూడా పంపించనుంది. డిటర్జెంట్ ప్రాసెస్‌లో భాగంగా.. చంద్రుడు, అంగారక గ్రహంపై పని చేయగల తక్కువ నీరు అవసరమయ్యే డిటర్జెంట్‌ను ఉపయోగించాలని చూస్తోంది. అందుకే మినిమాలిక్ వాషర్-డ్రై కాంబోను అభివృద్ధి చేస్తోంది. ఈ యంత్రాన్ని భూమిపై, ముఖ్యంగా ఎడారి వంటి ప్రాంతాలలో కూడా ఉపయోగించవచ్చు.