పండుగ పూట మోదీకి ఫోన్ చేసి దీనిపై మాట్లాడానన్న ట్రంప్.. మోదీ ఏమని ట్వీట్ చేశారంటే?

రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం ముగియాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ చెప్పారు.

పండుగ పూట మోదీకి ఫోన్ చేసి దీనిపై మాట్లాడానన్న ట్రంప్.. మోదీ ఏమని ట్వీట్ చేశారంటే?

Updated On : October 22, 2025 / 8:35 AM IST

Donald Trump: భారత ప్రధాని నరేంద్ర మోదీతో నిన్న తాను మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తెలిపారు. రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతులను తగ్గిస్తుందని, ఇది యుక్రెయిన్‌లో శాంతికి దారి తీస్తుందని చెప్పారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య తాను శాంతి తీసుకువచ్చానని కూడా ఆయన మరోసారి పేర్కొన్నారు.

వైట్‌హౌస్‌లో మంగళవారం జరిగిన దీపావళి వేడుకలో ట్రంప్ పాల్గొని దీపం వెలిగించారు. ఇండియా రాయబారి వినయ్‌ క్వాత్రా, భారత మూలాలున్న ఎఫ్‌బీఐ అధికారి కాశ్‌ పటేల్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ తుల్సీ గబ్బార్డ్‌, భారత్‌కి కొత్త అమెరికా రాయబారి సెర్జియో గోర్‌, భారతీయ వ్యాపార నాయకులు దీనికి హాజరయ్యారు.

ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీని ట్రంప్ “మంచి స్నేహితుడు” అని పేర్కొన్నారు. మంగళవారం మోదీతో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. భారత్‌-అమెరికా మధ్య మంచి ఒప్పందాలు జరుగుతున్నాయని.. వాణిజ్యం, ప్రాంతీయ శాంతిపై చర్చించామని వైట్‌హౌస్‌లో వెల్లడించారు. రష్యా ఆయిల్‌ దిగుమతలను తగ్గించడంపై తనకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని చెప్పారు. రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం ముగియాలని తాను కోరుకుంటున్నారని చెప్పారు.

Also Read: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

“మా మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన రష్యా నుంచి చమురును భారీగా కొనరు. ఆయనకూ యుద్ధం ముగియాలని ఉంది. భారత్‌ చమురును భారీ స్థాయిలో కొనడం లేదు. చాలా తగ్గించింది, ఇంకా తగ్గిస్తున్నారు” అని ట్రంప్ పేర్కొన్నారు.

భారత్‌ ప్రభుత్వం మాత్రం ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ట్రంప్‌ పేరును ప్రస్తావించకుండా ఓ ప్రకటన చేసింది. భారత్‌కు తన ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుందని తెలిపింది.

కాగా, చమురు అమ్ముతూ రష్యా సంపాదిస్తున్న డబ్బు యుద్ధానికి ప్రధానంగా ఉందని, భారత్‌ చమురు కొనడం ఆపితే రష్యా యుద్ధ యంత్రాంగం దెబ్బతింటుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

థ్యాంక్యూ అంటూ మోదీ ట్వీట్

తనకు ఫోన్‌ చేసి దివాలీ శుభాకాంక్షలు తెలిపినందుకు ట్రంప్‌కు ప్రధాని మోదీ థ్యాంక్యూ చెప్పారు. “మన రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలవాలని, ప్రపంచానికి ఇలాగే వెలుగులు అందించాలని ఈ దీపకాంతుల దీపావళి రోజున కోరుకుంటున్నాను” అని చెప్పారు.