12 దేశాల పౌరులు అమెరికాకు రాకుండా ట్రంప్ బ్యాన్‌.. ఎయిర్‌పోర్టుల్లో ఇతర దేశాల వారికీ ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయంటే?

తాము వచ్చిన విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత గంటసేపటి వరకు తాము అక్కడే ఉన్నామని అగ్యిలార్ చెప్పారు.

12 దేశాల పౌరులు అమెరికాకు రాకుండా ట్రంప్ బ్యాన్‌.. ఎయిర్‌పోర్టుల్లో ఇతర దేశాల వారికీ ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయంటే?

Updated On : June 10, 2025 / 3:21 PM IST

ఆఫ్రికన్, మిడిల్ ఈస్ట్‌ సహా 12 దేశాల పౌరులు అమెరికాకు రాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని విమానాశ్రయాల్లో చాలా మంది ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్న కొందరు అమెరికాకు వస్తున్నారు.

వారి గురించి విమానాశ్రయాల వద్ద అమెరికా అధికారులు మరింత క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. గ్వాటెమాలన్ నుంచి విన్సెంటా అగ్యిలార్ అనే మహిళ, ఆమె భర్త కలిసి సోమవారం మయామి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఆ తర్వాత అక్కడ అమెరికా అధికారులు మూడు వేర్వేరు ఇంటర్వ్యూలు చేశారు. దీంతో తాము ఆందోళనకు గురయ్యామని విన్సెంటా అగ్యిలార్ మీడియాకు చెప్పారు. గత వారం తమకు టూరిస్ట్ వీసాలు మంజూరయ్యాయని అధికారులకు ఆ జంట తెలిపింది.

తాము ఎక్కడ పని చేస్తున్నామని, తమకు ఎంత మంది పిల్లలు ఉన్నారని అధికారులు అడిగారని విన్సెంటా అగ్యిలార్ చెప్పారు. ఏవైనా చట్టపరమైన సమస్యలు వస్తే ఈ ప్రయాణ ఖర్చును ఎలా భరిస్తారని అడిగారని అన్నారు.

Also Read: 11ఏళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి మచ్చ లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తాము ఎన్ని రోజులు అమెరికాలో ఉంటారని కూడా అధికారులు అడిగారని అగ్యిలార్ చెప్పారు. అమె కుమారుడు 22 ఏళ్ల క్రితం గ్వాటెమాల నుంచి అమెరికాకు వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అగ్యిలార్, ఆమె భర్త అమెరికాకు రాలేదు. ఇప్పుడు తమ కుమారుడిని చూడడానికి వచ్చారు.

తాము వచ్చిన విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత గంటసేపటి వరకు తాము అక్కడే ఉన్నామని అగ్యిలార్ చెప్పారు. ట్రంప్‌ కొత్తగా బ్యాన్ విధించిన దేశాల జాబితాలో గ్వాటెమాల లేదు. అంటే నిషేధం విధించిన దేశాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి వస్తున్న వారిని కూడా అమెరికా అధికారులు మరింత క్షుణ్ణంగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. దీంతో అమెరికాకు వెళ్తున్న వారు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

గత వారం ట్రంప్ బ్యాన్ విధించిన దేశాల జాబితాలో అఫ్ఘానిస్థాన్, మయన్మార్, చాడ్, ది రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్‌ ఉన్నాయి. అలాగే, బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్థాన్, వెనిజులా ప్రజలపై ఉన్న ఆంక్షలు పెరిగాయి.

అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టులతో లాస్‌ ఏంజెలెస్‌ నగరంలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే ఈ ట్రావెల్‌ బ్యాన్‌ కూడా అమలులోకి రావడం గమనార్హం.

ట్రంప్‌ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2017లో విధించిన ట్రావెల్‌ బ్యాన్ వల్ల విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు మాత్రం అంతగా సమస్యలు లేకుండానే ట్రావెల్ బ్యాన్‌ అమలవుతోంది.