ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కు యూకే ఆమోదం

UK approves Oxford astrazeneca vaccine : ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు యూకే ఆమోదం తెలిపింది. ఇప్పటికే బ్రిటన్‌లో ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండగా.. వచ్చే వారం నుంచి ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ వినియోగంలోకి రానుంది. ఆస్ట్రాజెనకా 10కోట్ల డోసులకు బ్రిటన్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మనదేశంలో ఆక్స్‌ఫర్డ్‌తో కలసి సీరం ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ తయారు చేస్తోంది. అత్యవసర వినియోగం కోసం ఇప్పటికే సీరం దరఖాస్తు చేసుకుంది. ఉత్పత్తి చేసే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్లలో సగం భారతదేశానికే కేటాయిస్తామని ప్రకటించింది.
మరోవైపు బ్రిటన్‌లో సరికొత్త రూపాన్ని సంతరించుకున్న కరోనా మహమ్మారి.. క్రమంగా అన్ని దేశాలు చుట్టబెట్టేసేలా కనిపిస్తోంది. భారత్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతోంది. కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య దేశంలో ఇరవైకి పెరిగింది. బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన 20 మందికి కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది. హైదరాబాద్ సీసీఎంబీ సహా అనేక ల్యాబుల్లో మొత్తం 107 శాంపిళ్లను పరిశీలించారు.
సీసీఎంబీలో పరిశీలించిన శాంపిళ్లలో ఇద్దరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా, ఢిల్లీ తొమ్మిది, బెంగళూరులో ఏడు, హైదరాబాద్‌లో రెండు, కోల్‌కతాలో ఒకటి, పూణెలో ఒకటి, కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. కొత్త స్ట్రెయిన్ సోకిన వారిని ప్రత్యేక గదుల్లో ఐసొలేషన్‌లో ఉంచారు వైద్యులు. బాధితుల కాంటాక్టులు గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.
అగ్రరాజ్యం అమెరికాలో కొత్త స్ట్రెయిన్ ఎంట్రీ ఇచ్చింది. కొలరాడోలో తొలి కేసు నమోదు అయింది. 20 సంవత్సరాల యువకుడిలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్‌ను గుర్తించారు అధికారులు. మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆ యువకుడికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.
సాధారణ కరోనా వైరస్ లక్షణాల కంటే అతని అనారోగ్య తీవ్రత అధికంగా ఉండటంతో శాంపిళ్లను సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్‌కు పంపించారు. బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌గా దాన్ని నిర్ధారించారు. డెన్వర్‌లోని స్థానిక ఆసుపత్రి ప్రత్యేక వార్డులో ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు.