Donald Turmp: కాళ్ల బేరానికి వచ్చిన డొనాల్డ్ ట్రంప్..? రష్యాకి అదిరిపోయే ఆఫర్లు..!
తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రష్యా-యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రగల్భాలు పలికి బొక్కబోర్లాపడ్డారు.
Donald Turmp: అమెరికా అధ్యక్షుడు ట్రంప్..రష్యాకి ఆఫర్లు ఇస్తున్నారా..తానెంత ఒత్తిడి తెచ్చినా పుతిన్ కేర్ చేయకపోవడంతో..ఇక కాళ్ల బేరానికి వస్తున్నారా..ఈ డౌట్ ఎందుకంటే, యూరోపియన్ యూనియన్ దేశాలకు ట్రంప్ పంపిన శాంతి ఒప్పందంలో రష్యాకి కొన్ని తాయిలాలు ప్రకటించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. గతంలో ఎలాగైతే రష్యా నుంచి యూరోపియన్ దేశాలు ఇంధనం దిగుమతి చేసుకున్నాయో అలాగే దిగుమతి చేసుకోవచ్చనేది ప్రధాన ప్రతిపాదనగా తెలుస్తోంది. దాంతో పాటే యుద్ధం కనుక ముగిస్తే, రష్యాలో అమెరికా బోలెడు పెట్టుబడులు పెడుతుందని కూడా ట్రంప్ ఆఫర్ చేశారట.
తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రష్యా-యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రగల్భాలు పలికి బొక్కబోర్లాపడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది కావొస్తున్నా మాస్కో-కీవ్ మధ్య శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ఈ విషయంలో ట్రంప్ ఫెయిలవుతున్నట్లు ప్రచారం సాగుతుండగా ఓ కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడానికి ఆంక్షలతో రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయినా సరే పుతిన్ వెనక్కి తగ్గకపోవడంతో ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
రష్యాకు ఆఫర్లు.. వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం..
రష్యాకు అనుకూలంగా కొన్ని ఆఫర్లు ఇచ్చినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. ఈ మధ్యనే ఐరోపా దేశాలకు ట్రంప్ అందజేసిన శాంతి ప్రణాళికలో అనుబంధంగా తాజా ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి ఇంధన సరఫరాను యూరోపియన్ దేశాలకు పునరుద్ధరించాలనేది ఈ ప్రతిపాదనల్లో ఒకటి. అలాగే, రష్యాలోని అరుదైన ఖనిజ రంగాల్లో పెట్టుబడులతో పాటు.. స్తంభింపజేసిన మాస్కో ఆస్తుల రిలీజ్ వంటివి ఇందులో ఉన్నాయి. అమెరికా వాణిజ్య, ఆర్థిక సంస్థలు ఫ్రీజ్ చేసిన రష్యా సావరిన్ ఫండ్ నిధులను ఉక్రెయిన్ ప్రాజెక్టులకు వినియోగించే ప్రణాళిక కూడా ప్రతిపాదనల్లో ఉంది.
జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌తో ఓ డేటా సెంటర్ ఏర్పాటు వంటి అంశాలు కూడా ఉన్నట్టు ఆ కథనం పేర్కొంది. రష్యాలోని అరుదైన ఖనిజాల తవ్వకం, చమురు వెలికితీత వంటి వ్యూహాత్మక రంగాల్లో అమెరికా సంస్థలు పెట్టుబడులు పెట్టే విషయాన్ని శాంతి ప్రణాళికలో ప్రస్తావించారు.
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య దాదాపు నాలుగేళ్లుగా సంఘర్షణ కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన తిప్పలు తాను పడుతుండగా.. 2 నెలల క్రితం 28 అంశాలతో శాంతి ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళికలో సింహభాగం రష్యాకు అనుకూలంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేసిన నాటో దేశాలు..కొన్ని సవరణలు సూచించాయి. ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే అంశంపై అమెరికా మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. కానీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ నుంచి ఈ చర్చలపై సరైన స్పందన రాకపోవడం పట్ల ట్రంప్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.
జెలెన్‌స్కీ శాంతి ప్రణాళికలోని అంశాలను ఇంకా చదవకపోవడం తనను నిరాశకు గురిచేసిందని ట్రంప్ ఈ మధ్యనే చెప్పారు. అంతేకాదు ఉక్రెయిన్ ప్రజలు స్వాగతిస్తుంటే.. జెలెన్‌స్కీ మాత్రం అంగీకరించడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇలా రష్యాకి ఆఫర్లు ప్రకటిస్తున్నారని ప్రచారం సాగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
