ఆ విషయం డొనాల్డ్ ట్రంప్‌నకు తెలియదట..! సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న నెటిజన్లు.. నువ్వేం అధ్యక్షుడివి సామీ అంటూ..
భారత దేశంపై సుంకాల పెంపు విషయం గురించి ట్రంప్‌ను మీడియా ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు.

Donald Trump
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో చెప్పడం కాస్త కష్టమే. తన మాట వినని దేశాలపై సుంకాల పెంపుతో బెదిరింపులకు దిగడం ఆయన నైజం. ఈ క్రమంలోనే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తోన్న దేశాలపై ప్రస్తుతం ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. ఇందులో భాగంగా భారతదేశంపైనా ట్రంప్ తన అక్కస్సు వెళ్లగక్కుతున్నాడు. ఇప్పటికే భారత్ నుంచి దిగుమతులపై 25శాతం టారిఫ్‌లు విధిస్తానని చెప్పిన ట్రంప్.. వచ్చే 24 గంటల్లో మరింత సుంకాలు పెంచుతానంటూ హెచ్చరించాడు. అయితే, తాజాగా.. దీనిపై ఆయన మాట మార్చారు.
లాస్ ఏంజిల్స్‌లో 2028కి సంబంధించి ఒలింపిక్స్ నిర్వహణపై వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు. భారత దేశంపై సుంకాల పెంపు విషయం గురించి ట్రంప్‌ను మీడియా ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందున 25శాతం సుంకాలు విధిస్తున్నామని.. వాటిని భారీగా పెంచుతామని ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు మాట మార్చి.. అలాంటి శాతాలేవీ తాను చెప్పలేదన్నారు.
‘‘నేనెప్పుడూ సుంకాలపై శాతాల గురించి చెప్పలేదు.. కానీ, దానిపై కసరత్తు చేస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి. చాలా తక్కువ సమయంలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రష్యాతో సమావేశం జరగనుంది. అందులో ఏం జరుగుతుందో చూడాలి’’. అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఓ మీడియా ప్రతినిధి రష్యా నుంచి అమెరికాకు యురేనియం, ఎరువులు దిగుమతిపై అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్‌కు గురవుతుంది.
#WATCH | Responding to ANI’s question on US imports of Russian Uranium, chemical fertilisers while criticising their (Indian) energy imports’, US President Donald Trump says, “I don’t know anything about it. I have to check…”
(Source: US Network Pool via Reuters) pic.twitter.com/OOejcaGz2t
— ANI (@ANI) August 5, 2025
రష్యాతో అమెరికా వాణిజ్యం చేస్తోందంటూ భారత్ చేసిన వాదనపై విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించారు.. మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటోందా..? అని ప్రశ్నించగా.. మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటున్న విషయంపై తనకు అవగాహన లేదు.. తెలుసుకోవాలి. అయితే, దీనిపై త్వరలోనే మీకు సమాధానం ఇస్తా అంటూ ట్రంప్ పేర్కొన్నాడు. ట్రంప్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. కొందరు నువ్వేం అధ్యక్షుడివి సామీ అంటూ విమర్శలు చేస్తుండగా.. మరికొందరు.. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు కదా.. మరి ఇప్పుడు అమెరికాపై ఎవరు సుంకాలు విధించాలి అని ప్రశ్నిస్తున్నారు.